సరదా కోసమే విమానానికి బాంబు బెదిరింపు..13ఏళ్ల బాలుడు అరెస్ట్

ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-23 12:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 18న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీల అనంతరం ఇది బూటకమని తేల్చారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ 13ఏళ్ల బాలుడిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఐజీఐ ఎయిర్ పోర్ట్) ఉషా రంగాని తెలిపారు. ఆ బాలుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిగా గుర్తించారు.

కేవలం సరదా కోసమే విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ పంపినట్టు పోలీసుల ఎదుట బాలుడు అంగీకరించారు. బాలుడి తల్లిదండ్రులు తనకు చదువు నిమిత్తం మొబైల్ ఇచ్చారని, దాని ద్వారానే ఈ మెయిల్ పంపాడని ఉషా రంగాని వెల్లడించారు. మెయిల్ పంపిన అనంతరం ఐడీని తొలగించినట్టు తెలిపారు. భయంతో తల్లిదండ్రులకు విద్యార్థి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఇటీవల మరో యువకుడు సైతం ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడన్న వార్తతో బాలుడు స్ఫూర్తి పొందాడని, ఈ క్రమంలోనే తను కూడా బాంబు హెచ్చరిక మెసేజ్ పంపినట్టు చెప్పారు. కౌన్సెలింగ్ అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈమెయిల్‌కు లింక్ చేసిన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ నెల ప్రారంభంలోనూ ఢిల్లీ నుంచి కెనడాలోని టొరంటో వెళ్తున్న ఎయిర్ కెనడా విమానానికి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి 13 ఏళ్ల బాలుడు మెయిల్‌ పంపినట్టు పోలీసులు గుర్తించారు. అంతుకుముందు కూడా అనేక చోట్ల బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి.


Similar News