సహచర విద్యార్థులపై బాలుడి కాల్పులు..
14 ఏళ్ల బాలుడు తన ఉపాధ్యాయుడిని కాల్చాడు. ఇతర విద్యార్థులు, సెక్యూరిటీ గార్డ్‌పై కూడా కాల్పులు జరిపాడు.
బెల్‌గ్రేడ్: 14 ఏళ్ల బాలుడు తన ఉపాధ్యాయుడిని కాల్చాడు. ఇతర విద్యార్థులు, సెక్యూరిటీ గార్డ్‌పై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటన సెర్బియాలోని వ్లాడిస్లావ్ రిబ్నికల్ ఎలిమెంటరీ స్కూల్‌లో బుధవారం ఉదయం జరిగింది. ఎనిమిది మంది విద్యార్థులతో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ చనిపోయినట్లు సెర్బియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. కాల్పులు జరిగిన సమయంలో తన కుమార్తె కూడా అదే తరగతి గదిలో ఉందని ఓ విద్యార్థిని తండ్రి మిలన్ మిలోసెవిక్ చెప్పారు. ‘నా కుమార్తె తప్పించుకోగలిగింది. ఆ బాలుడు మొదట ఉపాధ్యాయుడిని కాల్చాడు. తర్వాత యధేచ్చగా కాల్చడం ప్రారంభించాడు’ అని మిలోసెవిక్ చెప్పారు.
ఉపాధ్యాయుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని స్కూలు ఉన్న వ్రాకార్ జిల్లా మేయర్ మిలన్ నెడెల్జ్‌కోవిక్ తెలిపారు. ఎనిమిది మంది పిల్లలు, ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయారని, ఉపాధ్యాయుడితో పాటు ఆరుగురు పిల్లలు ఆస్పత్రి పాలయ్యారని అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాల్పులు జరిపిన ఏడో తరగతి విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని.. కాల్పుల వెనక గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.