Maharashtra: దళితులపై మరో అమానుషం.. వాటిని దొంగిలించారని..

దళితులపై మరోసారి అమానుషం జరిగింది. మేక, పావురాలు దొంగిలించారనే అనుమానంతో నలుగురు దళితులను ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి అగ్రవర్ణానికి చెందిన ఆరుగురు కర్రలతో కొట్టారు.

Update: 2023-08-28 16:33 GMT

ముంబై: దళితులపై మరోసారి అమానుషం జరిగింది. మేక, పావురాలు దొంగిలించారనే అనుమానంతో నలుగురు దళితులను ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి అగ్రవర్ణానికి చెందిన ఆరుగురు కర్రలతో కొట్టారు. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ నెల 25వ తేదీన జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. గ్రామంలో అగ్రవర్ణ కులానికి చెందిన యువరాజ్ గలాండే, మనోజ్ బోడాకే, పప్పు పర్ఖే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బోరగే 20 ఏళ్లలోపు ఉన్న నలుగురు దళితులను వారి ఇళ్ల నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.

మేకను, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో దళితులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను నిందితుల్లో ఒకరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, బాధితుల్లో ఒకరైన శుభమ్ మగాడే ఫిర్యాదు చేశాడని తెలిపారు. నిందితులపై 307 (హత్యాయత్నం), 364 (కిడ్నాప్), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామన్నారు.

ఈ దారుణాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు శ్రీరాంపూర్ తాలూకాలోని హరేగావ్ గ్రామంలో బంద్ కూడా పాటించాయి. ఈ ఘటన మానవత్వానికి మచ్చ అని, బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేశ్ తపసే ఆరోపించారు.


Similar News