Karnataka: కర్ణాటకలో కండెక్టర్ పై దాడి కేసులో ట్విస్ట్
కర్ణాటకలో మరాఠీ మాట్లడటం లేదని బస్ కండెక్టర్ పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రయాణికుడికి మరాఠీలో సమాధానం చెప్పనందుకు ఆర్టీసీ బస్సు కండెక్టర్ పై నలుగురు దాడి చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మరాఠీ మాట్లడటం లేదని బస్ కండెక్టర్ పై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రయాణికుడికి మరాఠీలో సమాధానం చెప్పనందుకు ఆర్టీసీ బస్సు కండెక్టర్ పై నలుగురు దాడి చేశారు. అయితే, ఈ కేసులో కండెక్టర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని.. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కాగా.. సులేభావి గ్రామం దగ్గర బస్సులో ఎక్కిన మహిళ మరాఠీలో మాట్లాడిందని కండెక్టర్ హుక్కేరి తెలిపాడు. అయితే, తనకు ఆభాష తెలియదని.. కన్నడలో మాట్లాడమని అడిగానని చెప్పాడు. మరాఠీ తెలియదని చెప్పగానే.. ఆ యువతి తనని తట్టిందని.. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి తనపై దాడి చేశారని ఆయన వివరించాడు. గాయపడిన బస్సు కండక్టర్‌ను బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందతున్నట్లు తెలిపారు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
పోక్సో కేసు
అంతేకాకుండా, ఈ దాడి ఘటనలో మరో ట్విస్టు బయటపడింది. బాధిత కండెక్టర్ పై బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బస్సులో ప్రయాణించిన 14 ఏళ్ల బాలిక ఇచ్చిన ప్రతి ఫిర్యాదు ఆధారంగా కండెక్టర్ పైనా పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాలికపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కండక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోక్సో చట్టం కేసుకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. ఆ ఆరోపణలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. బెళగావిలో మరాఠీ మాట్లాడే జనాభా గణనీయంగా ఉంది. వారిలో ఒక వర్గం ఆ జిల్లాను మహారాష్ట్రతో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. దీన్ని అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.