Bomb Threat: ఢిల్లీలోని నాలుగు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని మూడు మాల్స్, ఒక ఆస్పత్రికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.

Update: 2024-08-20 10:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని మూడు మాల్స్, ఒక ఆస్పత్రికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. అయితే, ప్రజలను ఖాళీ చేయించి, ఆప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపడితే కొన్నిగంటల్లోనే అమర్చిన బాంబు పేలుతుందని ఈమెయిల్ వచ్చిందన్నారు. అయితే, ఆ బెదిరింపులు బూటకమని తేల్చారు. చాణక్య మాల్ (చాణక్యపురి), సెలెక్ట్ సిటీవాక్ (సాకేత్), ఆంబియెన్స్ మాల్ (వసంత్ కుంజ్), ప్రైమస్ హాస్పిటల్ (చాణక్యపురి)తో పాటు మరికొన్ని చోట్ల బాంబు బెదిరింపులకు సంబంధించి తమకు సమాచారం అందిందని సీనియర్ అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు వచ్చిన చోట్ల ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు సోదాలు నిర్వహించాయన్నారు. సోదాల్లో ఎలాంటి బాంబు లభించలేదని వెల్లడించారు. దీనిపై, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈమెయిల్ ఎక్కడ్నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేపడుతున్నారు.

బెదిరింపు ఈమెయిల్స్

ఇకపోతే, ఆగస్టు 17న, గురుగ్రామ్‌లోని యాంబియన్స్ మాల్ మేనేజ్‌మెంట్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. మాల్ ని ఖాళీ చేయించి తనిఖీ చేసిన పోలీసులకు ఎక్కడా బాంబు దొరకలేదు. ఆగస్టు 17నే నోయిడాలోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా వద్ద అధికారులు బాంబు భయంతో ప్రజలను భవనం నుండి ఖాళీ చేయించారు. అయితే, మాల్ భద్రతను తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్ కోసం దీనిని చేసినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు, ఆగస్టు 2న గ్రేటర్ కైలాష్‌లోని ఒక పాఠశాలకు ఈమెయిల్ బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, తనిఖీలు చేపట్టిన పోలీసులకు అక్కడ కూడా ఏమీ లభించలేదు.


Similar News