North Floods: ఉత్తర భారతంలో భారీ వర్షాలకు 28 మంది మృతి
అమర్‌నాథ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులు ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర భారంలో భారీ వర్షాలకు సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. హర్యానాలోనైతే డ్యామ్ దెబ్బతిని అనేక గ్రామాలను ముంచెత్తింది. అమర్‌నాథ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జమ్మూ కాశ్మీర్ అధికారులు ప్రకటించారు. రాజస్థాన్‌లో అత్యధికంగా శని, ఆదివారాల్లో 16 మంది మరణించారు. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మొత్తంగా వర్షాల వల్ల జరిగిన ప్రమాదాల్లో ఆదివారం ఒక్కరోజే ఉత్తరాదిన మొత్తం 28 మంది ప్రాణాలను కోల్పోయారు. పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసం అయ్యాయి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఆదివారం వరదల ప్రవాహానికి వాహనం కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులతో సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఢిల్లీలో భారీ వర్షాల వల్ల రహదారులపై నీటి ఎద్దడి, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోహిణి సెక్టార్ 20లోని అధికంగా నీరు చేరడంతో పార్కులో ఏడేళ్ల బాలుడు మునిగి చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌లో సైతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా 280కి పైగా రహదారులు మూసుకుపోయాయి. ముగ్గురు బాలికలు మృతి చెందగా, ఒకరు తప్పిపోయారు. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, అస్సాం, హర్యానా రాష్ట్రాల్లో ఆదివారం సాయంత్రం అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసినట్లు భారత వాతవరణశాఖ పేర్కొంది.