బీహార్‌లో పిడుగుపాటుకు 24 గంటల్లో 25 మంది మృతి
గత రెండు రోజులుగా బీహార్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: గత రెండు రోజులుగా బీహార్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు 25 మంది ప్రాణాలు కోల్పోగా, 39 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మధుబనిలో ఐదుగురు, ఔరంగాబాద్‌లో నలుగురు, సుపాల్‌లో ముగ్గురు, నలందలో ముగ్గురు, లఖిసరాయ్, పాట్నాలో ఇద్దరు చొప్పున, బెగుసరాయ్, జాముయి, గోపాల్‌గంజ్, రోహ్తాస్, సమస్తిపూర్, పూర్నియాలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఈ మరణాలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం అందించాలని అధికారులను తాజాగా ఆదేశించారు. అలాగే, వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కిషన్‌గంజ్, అరారియా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
బీహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, ఒక్క జులై నెలలోనే పిడుగుపాటు కారణంగా 50 మంది మరణించారు. అయితే అనధికారిక లెక్కలు అంతకంటే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తుంది. గురువారం, తరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కా గావ్ గ్రామంలో ఒక తాటి చెట్టుపై పిడుగు పడటంతో దానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పాఠశాల తరగతి గదిలో 22 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు.