Braj mandal Yatra: బ్రజ్‌ మండల్ యాత్ర ఎఫెక్ట్.. నుహ్‌లో జిల్లాలో 24 గంటలు ఇంటర్నెట్ బంద్

హర్యానాలో ప్రతిష్టాత్మకంగా జరిగే బ్రజ్‌మండల్ యాత్రలో గత ఏడాది మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఈ సారి అలాంటివి జరగకుండా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-07-21 13:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో ప్రతిష్టాత్మకంగా జరిగే బ్రజ్‌ మండల్ యాత్రలో గత ఏడాది మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఈ సారి అలాంటివి జరగకుండా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు(24 గంటల పాటు) నుహ్‌లో జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ SMS సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) అనురాగ్ రస్తోగి ఉత్తర్వులు జారీ చేశారు.

నుహ్‌లో యాత్ర జరిగే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే ఆందోళనలు, అల్లర్లు, ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా నిరోధించడానికి, అలాగే ఫేస్‌బుక్, ఎక్స్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా "తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తిని ఆపడానికి" ఇంటర్నెట్ సేవలు బంద్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, యాత్ర సజావుగా సాగేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నూహ్ పోలీసులు తెలిపారు.

గత ఏడాదిలో 2023లో విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన వార్షిక బ్రజ్‌ మండల్ తీర్థయాత్ర సందర్భంగా నుహ్ జిల్లాలో ముస్లింలు, హిందువుల మధ్య మతపరమైన హింస చెలరేగింది. జులై 31న ఒక గుంపు విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ మత ఘర్షణల్లో రాళ్లు రువ్వడం, కార్లకు నిప్పు పెట్టడం వంటివి జరిగాయి. ఆందోళనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, పలువురు పోలీసులతో సహా కనీసం 15 మంది గాయపడ్డారు. దీంతో ఇలాంటి ఘర్షణలు మళ్లీ జరగకుండా చూడటానికి హర్యానా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Tags:    

Similar News