G20 Declaration : జీ20​ సక్సెస్ ​వెనుక 'సూపర్ మ్యాన్' అమితాబ్..

‘ఢిల్లీ డిక్లరేషన్’.. ఈసారి జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఇదే వెరీ స్పెషల్.

Update: 2023-09-10 11:53 GMT

న్యూఢిల్లీ : ‘ఢిల్లీ డిక్లరేషన్’.. ఈసారి జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఇదే వెరీ స్పెషల్. వాస్తవానికి జీ20 సదస్సులలో రెండోరోజు వరకు కూడా కూటమిలోని సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం చాలా పెద్ద సవాల్. అలాంటిది సదస్సులో మొదటి రోజే ఉమ్మడి తీర్మానం (ఢిల్లీ డిక్లరేషన్) పై భారత్ ప్రకటన చేసింది. కొరకరాని కొయ్యలుగా మారిన చైనా, రష్యా, ఐరోపా దేశాలను కూడా అవలీలగా ఒప్పించి, మెప్పించింది. అయితే ఈ ఏకాభిప్రాయం కుదరడం వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు. ఆయనే జీ20లో భారత షెర్పాగా వ్యవహరించిన అమితాబ్‌ కాంత్‌.

దాదాపు 200 గంటల చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్ట్ బిల్లులతో అలుపెరుగని కసరత్తు చేసిన తర్వాత ఈ ఏకాభిప్రాయాన్ని సాధించామని ఆయన వెల్లడించారు. తన టీమ్‌లోని సభ్యుల సహకారం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె. నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల టీమ్‌తో కలిసి తాను వివిధ దేశాల ప్రతినిధులతో, దౌత్యవేత్తలతో 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించానని అమితాబ్ కాంత్ తెలిపారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై కొన్ని దేశాల అంగీకారాన్ని పొందడానికి ఉమ్మడి తీర్మానం కాపీలను 15 సార్లు సవరించాల్సి వచ్చిందన్నారు.


Similar News