Bangladesh Diplomats: భారత్ లోని బంగ్లా దౌత్యవేత్తలపై సస్పెన్షన్ వేటు

బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరోసారి అల్లర్లు కూడా జరిగాయి.

Update: 2024-08-26 08:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరోసారి అల్లర్లు కూడా జరిగాయి. ఇలాంటి టైంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హై కమిషన్‌లో ఫస్ట్‌ సెక్రటరీగా కొనసాగుతున్న షబాన్‌ మహమ్మద్‌, కోల్‌కతాలోని బంగ్లాదేశ్‌ కాన్సులేట్‌లో పనిచేస్తున్న రంజన్‌ సేన్‌పై ఈ వేటు వేసింది.

తాత్కాలిక ప్రభుత్వం ఆదేశాలు

తన పదవీకాలం ముగియడానికి ముందే రాజీనామా చేయాలని షబాన్‌ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రంజన్‌ను విధుల నుంచి తొలగించింది. ఇకపోతే, ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడాల్సి వచ్చింది. అయితే, ఆమె భారత్ లోనే ఉన్నారు. హసీనా ప్రభుత్వం రద్దవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దానికి నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వం అన్ని దేశాలతో స్నేహసంబంధాలు కొనసాగిస్తుందని యూనస్‌ తెలిపారు.


Similar News