Industrial Parks :12 పారిశ్రామిక పార్కులు మంజూరు.. వ్యాపారాలకు ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ : నిర్మల

దిశ, నేషనల్ బ్యూరో : ‘జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్’ ప్రోగ్రాంలో భాగంగా మరో 12 పారిశ్రామిక పార్కులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Update: 2024-07-23 13:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్’ ప్రోగ్రాంలో భాగంగా మరో 12 పారిశ్రామిక పార్కులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో వ్యాపార అవకాశాలను పెంచడానికి, వ్యాపారాల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడానికి దోహదం చేసే డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అప్లికేషన్లను రూపొందిస్తామని ఆమె ప్రకటించారు. ప్రైవేటురంగంలో వైవిధ్య ఆవిష్కరణలకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్’‌లను అందించేందుకు 3 స్కీంలను అమలు చేస్తామని నిర్మల తెలిపారు. ఈపీఎఫ్‌ఓలో సంస్థ నమోదు, కొత్త ఉద్యోగుల భర్తీ, ఉద్యోగులతో పాటు కంపెనీలకు సహాయం అందించేందుకు ఈ మూడు స్కీంలు అమలవుతాయన్నారు. భారత నౌకాయాన పరిశ్రమ మరింత మందికి ఉపాధిని కల్పించేలా సంస్కరణలను తీసుకొస్తామని వెల్లడించారు. నౌకాయాన పరిశ్రమ యాజమాన్యం, లీజింగ్ వంటి వ్యవహారాలతో ముడిపడిన సంస్కరణలను రానున్న రోజుల్లో అమలు చేస్తామన్నారు.

అందరికీ అవకాశాల కోసం 9 ప్రాధాన్యాలు

దేశంలో అందరికీ అవకాశాలను క్రియేట్ చేయడానికి 9 ప్రాధాన్య అంశాలను నిర్మలా సీతారామన్ తెలియజేశారు. అవేమిటంటే.. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత - సుస్థిరత, ఉద్యోగావకాశాలు - నైపుణ్య వికాసం, మానవ వనరుల వికాసం - సామాజిక న్యాయం, మ్యానుఫ్యాక్చరింగ్ - సేవారంగం, పట్టణ వికాసం, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ - అత్యాధునిక సంస్కరణలు. పేదలు, మహిళలు, యువత, రైతులపై ఫోకస్‌తో బడ్జెట్‌ను రూపొందించామని కేంద్రమంత్రి అన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే జాతీయ ఆహార భద్రతకు మరింత భరోసా లభిస్తుందన్నారు. మహిళలు, బాలికల సంక్షేమానికి సంబంధించిన పథకాలకు రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు చెందిన 100కుపైగా బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని నిర్మల వెల్లడించారు.

Tags:    

Similar News