మళ్లీ అధికారంలోకి వస్తే కులగణన : Priyanka Gandhi

Update: 2023-10-06 13:24 GMT

పాట్నా: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే పేదలకు 10 లక్షల ఇళ్లను కట్టిస్తామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్‌ తరహాలోనే రాష్ట్రంలో కుల గణనను నిర్వహిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన మున్సిపల్, పంచాయతీరాజ్ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. బస్తర్ అంతర్జాతీయ వేదికగా, ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించడానికి కాంగ్రెస్ సంక్షేమ పాలనే కారణమన్నారు. తమ ప్రభుత్వం వల్లే ఉద్యోగ అవకాశాల కల్పన పెరిగిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ ధనికులదేనని.. పేదలు, మధ్య తరగతి ప్రజల సమస్యలు దానికి పట్టవని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకే ఛత్తీస్‌గఢ్‌‌కు హింసాకాండ నుంచి విముక్తి లభించిందని ప్రియాంక అన్నారు. ‘‘ప్రధాని మోడీ ఇచ్చినవన్నీ బూటకపు హామీలే. దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైంది..? కోట్లాది ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమయ్యాయి?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘మోడీ సర్కార్‌ రైతులను నిర్వీర్యం చేసింది. రైతులు రోజుకు సగటున రూ.27 సంపాదిస్తుంటే.. అదానీ వంటి పారిశ్రామికవేత్తలు రోజుకు రూ.1600 కోట్లు సంపాదిస్తున్నారు’’ అని విమర్శించారు. బీజేపీ లక్ష్యం అధికారంలో కొనసాగడమే తప్ప ప్రజల సంక్షేమం కాదని మండిపడ్డారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో కులగణన నిర్వహించాలనే ప్రతిపాదనకు ప్రియాంకాగాంధీ కూడా సపోర్ట్ చేస్తున్నారని, ఆ దిశగా ముందుకే పోతామని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పష్టం చేశారు.


Similar News