సీఎం వైఎస్ జగన్కు నారా లోకేశ్ లేఖ
దిశ, ఏపీ బ్యూరో: చేనేత రంగానికి మరణశాసనం గా మారిన జీఎస్టీ పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని లేఖలో విమర్శించారు. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, […]
దిశ, ఏపీ బ్యూరో: చేనేత రంగానికి మరణశాసనం గా మారిన జీఎస్టీ పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరపాలని సీఎం వైఎస్ జగన్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని లేఖలో విమర్శించారు. చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోలు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చడమే చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణమని లేఖలో ఆరోపించారు. ‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెను భారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచడం మరణశాసనమే. రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో లాభం 2 నుంచి 5 శాతం రావడమే గగనంగా మారింది.
తాజా జీఎస్టీ పెంపు నిర్ణయం తో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఆ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చేనేత రంగంపై జీఎస్టీ భారం 5 శాతాన్ని మించకుండా సబ్సిడీలు కల్పించాలి. చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ఆప్కోని సమర్థవంతంగా వినియోగించాలి.
చేనేతకళని కాపాడటానికి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోలు, నేతన్నలకు ప్రోత్సాహకాలను తిరిగి అమలు చెయ్యాలి. భారతదేశ వస్త్ర సంప్రదాయంలో రాష్ట్ర చేనేత కు ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న చేనేత కళను, నేత కళాకారులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి’ అని నారా లోకేశ్ లేఖలో డిమాండ్ చేశారు.