N -95 మాస్క్‌లు లేవు

శానిటైజర్లు, ఔషధాల కొరత దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడికి అవసరమైన ఎన్-95 మాస్క్‌లు నగరంలో లేవు. మాస్క్ లతోపాటు మెడికల్ షాపుల్లో సాధారణ మాస్క్‌లు, శానిటైజర్లు సైతం ప్రస్తుత అవసరాలకు తగినంతగా లేకపోవడం గమనార్హం. అత్యవసర సేవల విభాగంలో మెడికల్ దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం అందులో కావాల్సిన మందులు, ఇతర వస్తువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టడం లేదు. కరోనాను నివారించేందుకు అందరూ మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లతో ఎప్పటికప్పుడూ చేతులు శుభ్రం చేసుకోవాలని […]

Update: 2020-03-27 20:51 GMT

శానిటైజర్లు, ఔషధాల కొరత

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడికి అవసరమైన ఎన్-95 మాస్క్‌లు నగరంలో లేవు. మాస్క్ లతోపాటు మెడికల్ షాపుల్లో సాధారణ మాస్క్‌లు, శానిటైజర్లు సైతం ప్రస్తుత అవసరాలకు తగినంతగా లేకపోవడం గమనార్హం. అత్యవసర సేవల విభాగంలో మెడికల్ దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం అందులో కావాల్సిన మందులు, ఇతర వస్తువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టడం లేదు.
కరోనాను నివారించేందుకు అందరూ మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లతో ఎప్పటికప్పుడూ చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే రిటైల్ మెడికల్ దుకాణాల్లో ఉన్న మాస్క్‌లు, శానిటైజర్లు అయిపోతున్నాయి. కొత్తగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరఫరా లేకపోవడంతో దుకాణం తెరిచినా ఉపయోగం లేకుండా పోయిందని మెడికల్ దుకాణాల యజమానులు వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 18 వేల మెడికల్ దుకాణాలు ఉండగా.. వాటిలో స్వల్పంగా అందుబాటులో ఉంచే 2,3 లేయర్ల మాస్క్‌లు చాలా మెడికల్ దుకాణాల్లో స్టాక్ అయిపోయింది. వైరస్‌లను నివారించే సామర్థ్యం కలిగిన ఎన్-95 అసలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. సాధారణంగా రూ.70 ఉండే ఈ మాస్క్ బ్లాక్ మార్కెట్లో రూ.300 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఈ మాస్క్‌లు సరఫరా చేసే ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి కూడా సరఫరా ఆగిపోయినట్టు తెలుస్తోంది. వీటితో పాటు సాధారణ మెడిసిన్స్ కూడా డిస్ర్టిబ్యూషన్ కేంద్రాల నుంచి సరఫరా ఆగిపోయింది.

నో స్టాక్.. నో సప్లయ్..

ఇప్పటికే పలు మెడికల్ దుకాణాల్లో మాస్క్‌లు, శానిటైజర్లకు కొరత ఏర్పడింది. డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల నుంచి సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నగరంలోని ప్రముఖ స్టాకిస్టుల వద్ద లోడింగ్ చేసేందుకు కూలీలు, సిబ్బంది డ్యూటీలకు రావడం లేదు. కరోనా భయాలతో వారంతా గోడౌన్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిర్వాహకులు కూడా వారిని గట్టిగా చెప్పి పనిచేయించుకోలేకపోతున్నారు. దీంతో మెడికల్ దుకాణాలకు అవసరమైన మెడిసిన్స్, ఇతర ఔషధాలు రావడం లేదు. కరోనా ప్రభావంతో మాస్క్‌ల ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో రిటైలర్ నుంచి రూ.5 వచ్చే మాస్క్ సైతం కొన్ని రోజులు రూ.30 వరకూ పలికింది. దీంతో ప్రభుత్వం రూ.10 మించి అమ్మొద్దని కఠినంగా చెప్పేసింది. అయితే ఇప్పుడసలు మార్కెట్లలో మాస్క్‌లు దొరకకుండా పోయాయి.

బీపీ, షుగర్ మందులు ఖతం..

రీటైల్ మెడికల్ దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ పరిస్థితి ఎన్ని నెలలో ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. దీంతో వారానికి, నెల రోజుల కోసం మందులు కొనుగోలు చేసేవారు మూడు నెలలకు కావాల్సిన మందులు ఒకేసారి కొనుక్కొని వెళ్తున్నారు. దీంతో వేరే వాళ్లకు ఆ ఔషధాలు దొరకకుండా పోతున్నాయి. మాస్క్, శానిటైజర్ల జాబితాలో బీపీ, షుగర్ వంటి రెగ్యులర్ కోర్స్ వాడాల్సిన మందులు దొరకకుండా పోతున్నాయి. రిటైల్ దుకాణాల్లో తక్కువ మోతాదుల్లోనే ఉండే ఈ మాత్రలు అయిపోయి, కొత్తగా రాకపోవడంతో ఆయా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ జ్వరాలకు ఉపయోగించే పారాసిటామోల్, డోలో-650 తరహా మాత్రల్లో ఒకే ఫార్మాతో వివిధ కంపెనీలు ఉండటంతో ఆ విధంగా నెట్టుకొస్తున్నారు. కానీ ప్రత్యేక డ్రగ్ వాడాల్సిన దీర్ఘకాలిక రోగులకు కావాల్సిన ఔషధాలకు మార్కెట్లో కొదవ తప్పడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పదు.
కరోనా వైరస్ బాధితులు పెరిగితే చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, బెడ్లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మాస్క్‌ లు, అత్యవసర మెడిసిన్ల విషయంలో అంత శ్రద్ధ తీసుకోనట్టు కనిపిస్తోంది. కరోనాను అడ్డుకోవడంలో మాస్క్ కీలకపాత్ర వహిస్తుందని జనాల్లోకి బాగా ప్రచారం వెళ్లిపోయింది. అలాగే సాధారణ, దీర్ఘకాలిక మాత్రలు కూడా లేకుండా ఎక్కువ మోతాదుల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే అదే స్థాయిలో సరఫరా చేయాల్సిన కంపెనీల నుంచి లింక్ సిస్టం తెగిపోయింది. వీటన్నిటిని పునరుద్ధరించకుంటే రోగులు, సాధారణ ప్రజలు మెడిసిన్ల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రభుత్వమే సరఫరా బాధ్యత తీసుకోవాలి

మెడికల్ దుకాణాల్లో చాలా రకాల మందులు ఇప్పటికే అయిపోయాయి. ఇంకో నెల వరకూ సాధారణ రకాల మందులు సరిపోతాయని అంచనా వేస్తున్నాం. మాస్క్‌లు, శానిటైజర్ల సరఫరా ఆగిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు హోల్ సేల్ మార్కెట్ల నుంచి కూడా రావడం లేదు. ప్రభుత్వమే మాస్క్, ఇతర మెడిసిన్స్ సరఫరాను టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా చేపడితే ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు. మందుల సరఫరా ఛైన్ మార్కెట్ ఎక్కడిక్కడ ఆగిపోయింది. డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి మందులను మెడికల్ దుకాణాలు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించాలని అసోసియేషన్ తరఫున కోరుతున్నాం.

– ఎ.శ్రీధర్, గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ దుకాణాల అసోసియేషన్

Tags: N-95 mask, telangana, health, corona, medical

Tags:    

Similar News