కేఆర్​ఎంబీ నిర్ణయాలపై ఉత్కంఠ

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలు రగులుతూనే ఉన్నాయి. జల జగడంపై ఇప్పటి వరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పనితీరుపై కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయడం ఏడేండ్లుగా సాగుతూనే ఉంది. గత ఏడాది అక్టోబర్​లో నిర్వహించిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో బోర్డు పరిధిపై నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ రూపొందించిన నివేదికను కేంద్ర హోం శాఖ […]

Update: 2021-07-06 15:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలు రగులుతూనే ఉన్నాయి. జల జగడంపై ఇప్పటి వరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పనితీరుపై కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయడం ఏడేండ్లుగా సాగుతూనే ఉంది. గత ఏడాది అక్టోబర్​లో నిర్వహించిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో బోర్డు పరిధిపై నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ రూపొందించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 15న వెలువడే అవకాశం ఉంది.

కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు విభజన చట్టం సెక్షన్‌–85 (1) ప్రకారం 2014లో బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పటిదాకా పరిధిని నోటిఫై చేయలేదు. ప్రస్తుతం జల వివాదాలు పెరుగుతున్నా బోర్డు ఏం చేయలేక చూడాల్సిన పరిస్థితుల్లో ఉంది. కాగా కేఆర్​ఎండీ ఛైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను గత నెల 11న నియమించిన విషయం తెలిసిందే. ఎంపీ సింగ్​ బుధవారం బోర్డు ఛైర్మన్​గా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.

నామమాత్రమే

కృష్ణా బేసిన్‌లో నీటి కేటాయింపు, యాజమాన్యం, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నామమాత్రంగా తయారయింది. దీనికి ప్రధాన కారణం బోర్డు పరిధి కూడా ఖరారు కాకపోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్రం ఎక్కువ నీటిని వాడుకుందని మరో రాష్ట్రం ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పంపి చేతులు దులుపుకొంటుందన్న అభిప్రాయం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ వర్గాల్లో నెలకొంది. మరోవైపు బోర్డు ఛైర్మన్లను కూడా త్వరగా మార్చుతుండటం, అవగాహన లేని వారిని ఛైర్మన్​గా వేయడం, వారికి అవగాహన వచ్చిన క్రమంలోనే మార్చడం కూడా వివాదంగానే మారింది.

ఇప్పుడేం చేస్తారు..?

ఇప్పుడు నీళ్ల వివాదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. చర్చించే అంశాలేమైనప్పటికీ… ఈ భేటీపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు ఛైర్మన్​గా నియమితులైన ఎంపీ సింగ్​బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇటు భేటీ, అటు రాయలసీమ పర్యటన సవాల్​గా మారుతోంది. ఈ రెండింటినీ రెండు ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. ఎన్జీటీ, కేంద్రం కూడా కేఆర్​ఎంబీ ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని ఆదేశించాయి. ఈ నెల 12లోగా పరిశీలన నివేదిక ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. కానీ అక్కడకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేసినా ఏపీ మాత్రం అడ్డు చెప్పుతూనే ఉంది.

తాజాగా ఏపీ మళ్లీ అడ్డు చెప్పింది. తెలంగాణ అనధికారికంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తోందని, కల్వకుర్తి, ఎస్‌.ఎల్‌.బి.సి. విస్తరణ చేపట్టిందని, ముందుగా దానిని పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు రావాలంటూ ఏపీ సీఎం జగన్​ కేంద్రానికి లేఖ రాశారు.
కృష్ణాబోర్డు ఈనెల 9న జరపాలని నిర్ణయించిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. నీటి వాటాలను సవరించడం సహా తమకు సంబంధించిన అంశాలేమీ ఎజెండాలో లేవని కృష్ణాబోర్డుకు లేఖ రాసింది.

ఈ నేపథ్యంలో బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. రాయలసీమ పరిశీలనకు వెళ్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. త్రిసభ్య కమిటీ మీటింగ్​ను నిర్వహించేందుకే సిద్దంగా ఉన్నామని బోర్డు ఇంజినీర్లు చెప్పుతున్నా… ఛైర్మన్​ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.

Tags:    

Similar News