RRRకు సీఐడీ ఝలక్.. చంద్రబాబు పావుగా రఘురామ..!
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరానికి కొయ్యగా మారారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన కొద్దికాలంలోనే పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అంతేకాదు విధానపరమైన నిర్ణయాలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాతోపాటు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వైసీపీని ఓ రేంజ్‌లో ఉతికి ఆరేస్తున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాలను సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు అంశమే కాదు ఇంకా అనేక […]
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరానికి కొయ్యగా మారారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన కొద్దికాలంలోనే పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అంతేకాదు విధానపరమైన నిర్ణయాలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాతోపాటు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వైసీపీని ఓ రేంజ్‌లో ఉతికి ఆరేస్తున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాలను సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు అంశమే కాదు ఇంకా అనేక అంశాలపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంగా మారిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో అసహనంగా ఉన్నారు.
ఇకపోతే ఎంపీ రఘురామపై సీఐడీ రాజద్రోహం కేసు పెట్టి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎంపీ రఘురామకు కోలుకోలేని షాక్ ఇచ్చింది సీఐడీ. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌లో రఘురామకృష్ణంరాజుతో పాటు చంద్రబాబు, నారా లోకేష్, టీవీ 5, ఏబీఎన్ ఛానళ్లకు సంబంధించి సంచలన అంశాలను బయటపెట్టింది. సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం వీరంతా కలిసి కుట్ర చేశారని అఫిడవిట్‌లో పొందుపరిచింది. ఎంపీ రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో పాటు రెండు టీవీ ఛానళ్ల డైరెక్షన్‌లో నడుస్తున్నారని ఆరోపించింది.
వాట్సాప్ చాటింగ్ బట్టబయలు..
రఘురామపై కేసులో సీఐడీ సంచలన విషయాలను అఫిడవిట్‌లో బహిర్గతం చేసింది. చంద్రబాబు-రఘురామ వాట్సాప్ ఛాటింగ్‌ను బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజుతో విపక్ష నేత చంద్రబాబు నేరుగా వాట్సాప్ చాట్ చేసినట్లు సీఐడీ ఆరోపించింది. సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు సీఐడీ తెలిపింది. తాము దర్యాప్తులో భాగంగా రఘురామ సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ కోర్టుకు విన్నవించింది. ఇందుకు తగిన ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వాట్సాప్ చాటింగ్‌లో వీరిద్దరూ చర్చించుకున్న కీలక అంశాలను సీఐడీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో పొందుపరిచింది. దీంతో ఈ అంశాలు రఘురామపై రాజద్రోహం కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
చంద్రబాబు డైరెక్షన్‌లోనే రఘురామ..
టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎంపీ రఘురామ నడుస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబుతో ఎంపీ రఘురామ వాట్సాప్ సంభాషణలే అందుకు నిదర్శనమని చెప్తోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేయాలి? అందులో ఏ అంశాలు ఉండాలి? వంటి అంశాలను చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ పిటిషన్ కాపీని చంద్రబాబు స్వయంగా చూసి తన న్యాయ సలహాదారులతో చర్చించి ఆమోదించిన తరువాతే న్యాయస్థానంలో రఘురామకృష్ణంరాజు దాన్ని దాఖలు చేశారంటూ మండిపడుతుంది.
చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ఇందులో కీలకంగా మారిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజద్రోహం కేసు నుంచి ఈజీగా బయటపడతామని ఎంపీ రఘురామ భావించారు. అయితే ఆయన ఆశలు ఆవిరయ్యేలా సీఐడీ షాక్ ఇచ్చింది. చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియాతో వాట్సాప్ చాటింగ్ వ్యవహారం బట్టబయలు చేయడంతో ఈ కేసు ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.