అన్నదమ్ములిద్దరం రాజీనామా చేస్తాం.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన ప్రకటన
దిశ, మునుగోడు: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి సంపూర్ణ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే తమ సోదరులిద్దరం ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చౌటుప్పల్ మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ సంరద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయిస్తే తమ పదవులకు […]
దిశ, మునుగోడు: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి సంపూర్ణ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే తమ సోదరులిద్దరం ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చౌటుప్పల్ మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ సంరద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయిస్తే తమ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా తిరిగి పోటీ కూడా చేయబోమని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 1350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు.
ప్రభుత్వ కాంట్రాక్టు అంటేనే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు. తెలంగాణకు నది అంటేనే మూసీ అని దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన కోసం సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడుతానని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని, సీఎం వాసలమర్రికి రెండు సార్లు వస్తే ఎంపీగా నాకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు కనీసం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ‘దళితబంధు’ పెట్టిన రోజే కేసీఆర్ ఓడిపోయారని, దళితులకు కేబినెట్‌లో స్థానం ఇవ్వకుండా సీఎం ‘దళితబంధు’ పేరుతో మోసం చేస్తున్నాడని అన్నారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి పాత నల్లగొండ జిల్లా బౌండరీలు తెలుసా? అని ప్రశ్నించారు. ఎంపీ స్థానంలో ఉండి రెండేండ్ల నుంచి అపాయిట్‌మెంట్ అడుగుతున్నా.. ఇంతవరకు దిక్కేలేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్క శ్రీనాథ్, వైస్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.