ఈటల ఎపిసోడ్‌లో బండి భారీ స్కెచ్.. సీఎం జైలుకెళ్లడం తప్పదా..?
దిశప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యూహత్యకంగా వ్యవహరించారా? ఆపరేషన్ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినా లీకులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ సక్సెస్ అయ్యారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన పరిణామాలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ విషయంలో ఆచితూచి అడుగేస్తూ చివరకు బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లే వరకూ తనకేం తెలియదన్నట్టుగా వ్యవహరించారు. సీక్రెట్‌గా ఈటలతో టచ్‌లో […]
దిశప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యూహత్యకంగా వ్యవహరించారా? ఆపరేషన్ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినా లీకులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ సక్సెస్ అయ్యారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన పరిణామాలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ విషయంలో ఆచితూచి అడుగేస్తూ చివరకు బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లే వరకూ తనకేం తెలియదన్నట్టుగా వ్యవహరించారు. సీక్రెట్‌గా ఈటలతో టచ్‌లో ఉన్న సంజయ్ ఆయన్ను బీజేపీలో చేర్పించేందుకు పకడ్భందీగా స్కెచ్ వేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కూటములను బీజేపీకి అనుకూలంగా మల్చుకోవాలన్న ప్లాన్‌లో భాగంగా సంజయ్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది.
ఓనర్ల పంచాయితీ నాటి నుండే..
2018 ఎన్నికల తరువాత ఈటల రాజేందర్ గులాబీ ఓనర్లం మేము అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అప్పుడే బండి సంజయ్ స్పందిస్తూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకురావాలని పిలుపునిచ్చారు. మిడ్ మానేరు భూ నిర్వాసితుల పరిహారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బండి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. టీఆర్ఎస్ అధిష్టానం కూడా అప్పటి నుండే ఈటల వ్యవహారం వెనక ఏం జరుగుతోంది అన్న విషయంపై పోస్టుమార్టం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కూడా ఈటల, బండి సంజయ్ పరస్పర విమర్శలు కూడా చేసుకునేవారు కాదు. అప్పటి నుండే ఇద్దరి మద్య ఓ అండర్ స్టాండింగ్ ఉన్నప్పటికీ ఈటలను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసినప్పటి నుండి ఆచితూచి అడుగేసిన సంజయ్ వ్యూహాత్మకంగా ఆయనతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. రాజేందర్ ఖచ్చితంగా బీజేపీలో చేరతానని మాట ఇచ్చిన తరువాతే జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు ప్రముఖులతో అపాయింట్ మెంట్ తీసుకున్న సంజయ్ ముందుగా ఈటలను ఢిల్లీ పంపించారు. మరునాడు సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలిపించే పనిలో నిమగ్నం అయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు సాధించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు సెగ్మెంట్లపై దృష్టి సారించిన సంజయ్ ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుంటే పార్టీ మరింత శక్తివంతంగా తయారవుతుందని భావించే ఈటలను పార్టీలో చేర్పించుకునేందుకు సైలెంట్ మూవ్ మెంట్ చేశారని తెలుస్తోంది.
నడ్డా… ఈటల చర్చలు..
బీజేపీ సుప్రీం నడ్డాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ దోస్తానా చేసుకుంటున్నాయన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. టీఆర్ఎస్‌తో మేం స్నేహితంగా ఉంటే బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎలా ఎదుగుతుందని అన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం పనిచేస్తుంది తప్ప అలాంటి ప్రచారాలను నమ్మవద్దని నడ్డా స్పష్టం చేసినట్టు సమాచారం.
ఆ వ్యాఖ్యలే కీలకం..
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని గతంలో రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సంజయ్ కామెంట్స్‌ను ఓ వర్గం తప్పు పట్టే ప్రయత్నం చేసింది. అయితే, నడ్డాతో ఈటల భేటీలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై జాతీయ పార్టీగా మా వ్యూహం మాకుంటుంది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సమాధానం ఇచ్చారు. దీంతో గతంలో బండి చేసిన వ్యాఖ్యలకు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఈటలతో చేసిన కామెంట్స్ బలం చేకూర్చినట్టయింది.