తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్.. చరిత్రలో నిలిచిపోనున్నారుగా!
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ఈ గీతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువ సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అయితే అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో 2.30 నిమిషాల నిడివితో షార్ట్ అండ్ స్వీట్‌గా రూపొందించారు. రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.
అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కీరవాణి, సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లు కలిశారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్ హారిక 'తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం.. అలాగే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నన్ను చేర్చుకున్నందుకు కీరవాణి సార్‌కి, అందె శ్రీ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్‌కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, అంటే జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.