సౌందర్య చనిపోయిందన్న బాధ కన్నా ఆ విషయంలోనే ఎక్కువ కలవర పడ్డాను.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్‌!

అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ఎన్నో కోట్ల ప్రేక్షకుల మన్ననలు పొందింది.

Update: 2024-06-04 05:41 GMT

 దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ఎన్నో కోట్ల ప్రేక్షకుల మన్ననలు పొందింది. తెలుగు అమ్మాయి కాకపోయినా తన కట్టు బొట్టు నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఏ రోల్ చేసిన అందులో ఒదిగిపోయే గుణం సౌందర్యది. దాదాపు దశాబ్దన్నర కాలం పాటు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య.. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. అతి తక్కువ సమయంలోనే మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న సౌందర్య.. కెరీర్ పీక్‌ స్టేజ్ లో ఉన్న సమయంలో 2004లో బిజెపి కోసం సోదరుడు అమర్నాథ్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి ఆమె వెళ్తుండగా దురదృష్టవశాత్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

అయితే తాజాగా సౌందర్య మరణం పై సీనియర్‌ హీరో జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. అందులో భాగంగా ఇంటర్వ్యూలో జగపతి బాబును సౌందర్య లాంటి ఒక మంచి స్నేహితురాలిని కోల్పోయినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. `నేను ఫిలాసఫీ ఎక్కువ నమ్ముతాను. పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా వెళ్లిపోవాల్సిందే. జీవితంలో డబ్బుతో సహా ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనిషిని కోల్పోతే తిరిగి తీసుకు రావడం కష్టం. మనిషి చనిపోతే కచ్చితంగా ఏడవాలి అనే రూల్ లేదు. కానీ ఆ వ్యక్తిని మిస్ అవుతున్నామనే బాధ మనసులో ఉంటుంది. ఇక సౌందర్య చనిపోయినప్పుడు ఆమె మరణించిందన్న బాధ కన్నా నన్ను ఇంకొన్ని విషయాలు ఎక్కువ కలవరపెట్టాయి. ప్రమాదంలో సౌందర్యతో పాటు అమర్నాథ్ కూడా చనిపోయాడు. వారి అమ్మ పరిస్థితి ఏంటి ? అమర్ భార్య పరిస్థితి ఏంటి ? అతని పిల్లల పరిస్థితి ఏంటి ? ఇవే నా మైండ్ లో తిరిగాయి. సౌందర్య చనిపోయినందుకు ఏడవలేదు కానీ ఆమె ఫ్యామిలీ పరిస్థితి తలుచుకుని చాలా బాధపడ్డాను` అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా జగపతి బాబు, సౌందర్య జంటగా అల్లరి ప్రేమికుడు, పెళ్లి పీటలు, భలే బుల్లోడు ఇలా చాలా చిత్రాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ చూసి జగపతి బాబు, సౌందర్య ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి.


Similar News