ఆరా మస్తాన్ సర్వే పై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ఆ కక్షతోనే అంటూ
హీరో శివాజీ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు హీరోగా ఆయన కామెడీ, ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
దిశ, సినిమా: హీరో శివాజీ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు హీరోగా ఆయన కామెడీ, ఫ్యామిలీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఇతనికి క్రమంగా పరాజయాలు, రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా కెరీర్‌కి బ్రేక్ వచ్చింది. ఇటీవల `బిగ్ బాస్`లోకి వెళ్లాక ఆయన చేసే ప్రతి కామెంట్ హైలైట్‌గా, వైరల్‌గా మారి ఆయనకు క్రేజ్ వచ్చింది. ఆ మధ్య 90 మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన శివాజీ ఇప్పుడు సినిమాల్లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా ఏపీ ఎలక్షన్ సర్వేకి సంబంధించిన ఆరా మస్తాన్ ఫలితాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ఆరా మస్తాన్ కూటమికి వ్యతిరేకంగా తన సర్వే ఫలితాలు ప్రకటిస్తారని ఏపీ ఎన్నికల పోలింగ్ జరగడానికి ముందే హీరో శివాజీ చెప్పారు. అందులో భాగంగా.. ఇప్పుడే ఒక వార్త విన్నాను. ఒక సర్వే సంస్థకు సంబంధించిన మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా, టికెట్ అడిగితే ఇవ్వలేదనే కక్షతో ఓ సర్వే వదలబోతున్నాడు. నువ్వు 100 సర్వేలు చేసినా సోదరా ప్రజల సర్వే ముందు మీరంతా దేనికి పనికిరారు. కూటమి అభ్యర్ధులు ఘన విజయం సాధించబోతున్నారు. క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీలవుతున్నావు.. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు అంటూ శివాజీ వ్యాఖ్యానించారు.
కానీ అదే రోజు ఈ ప్రచారంపై ఆరా మస్తాన్ స్పందించి తాము పోలింగ్‌కు ముందు ఎలాంటి సర్వే విడుదల చేయడం లేదని , పోలింగ్ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడే పరోక్షంగా వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చారనే విషయం తెలిసిందే. కట్ చేస్తే నిన్న ఆరా సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉండటం చర్చనీయాంశమైంది. నిజంగానే కూటమి నుంచి టికెట్ దక్కలేదన్న కక్షతోనే మస్తాన్ ఇలాంటి సర్వే వదిలారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంపై శివాజీ మరోసారి స్పందిస్తారేమో చూడాలి.