సెలెబ్రిటీస్.. సెకండ్ ఇన్నింగ్స్.. రెండో పెళ్లికి రెడీ అంటున్న సినిమా స్టార్స్

రంగుల ప్రపంచంలో బతికే సెలబ్రిటీల మనస్తత్వాలు కూడా భిన్నంగా మారిపోతున్నాయి.

Update: 2024-08-20 15:26 GMT

రంగుల ప్రపంచంలో బతికే సెలబ్రిటీల మనస్తత్వాలు కూడా భిన్నంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియకపోవడమే కాకుండా.. ఎవరితో ఉంటున్నారో కూడా క్లారిటీ లేకుండా పోతున్నది. ప్రజెంట్ ఇదే ఇష్యూ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకరిని చూసి మరొకరు మారుతున్నారో అర్థం కావడం లేదు కానీ.. ఒకరిని మించి మరొకరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ రీల్​లైఫ్​కంటే ఎక్కువగా రియల్​లైఫ్​లో కనిపిస్తున్నది. సెలబ్రిటీల సెకండ్​ఇన్సింగ్స్​పై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.

- చుక్క సుధారాణి

హీరో, హీరోయిన్ల నయా ట్రెండ్

ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో ఎక్కువగా విడాకులు ఇష్యూస్ వినిపిస్తున్నాయి. కలిసి సినిమాలు చేసి ప్రేమలో పడుతున్న నటీనటులు.. కలిసి జీవించలేక పోతున్నారు. దీంతో మొదట ప్రేమ వివాహం చేసుకుని తర్వాత విడిపోతున్నారు. విడాకులు తీసుకుని గుడ్ బై చెప్పేసుకుని మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే.. మళ్లీ తమకు నచ్చిన వాళ్లని పెళ్లిళ్లు చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఈ పద్దతిని చాలా సెలబ్రిటీలు ఫాలో అవుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లు అన్నీ వాట్సప్ చాటింగ్‌లు, నాలుగు రోజుల ఆకర్షణగా తూతూ మంత్రంగా మిగిలిపోతున్నాయి. ఈ ట్రెండ్ సాధారణ పౌరుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే.. సమాజంలో పేరుప్రతిష్ఠలు, దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ సెట్ చేస్తున్నారు కూడా.

నరేశ్-పవిత్ర పెళ్లితో ఇండస్ట్రీ షేక్

సీనియర్ హీరోయిన్, డైరెక్టర్, సూపర్ స్టార్ కృష్ణ భార్యగా విజయ నిర్మలకు మంచి పేరు ఉంది. ఆమె కుమారుడిగా, బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎదిగిన నరేశ్ నాలుగు పెళ్లిలు చేసుకోని టాలీవుడ్‌లో రికార్టు సృష్టించారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిసారిగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేశ్ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు పుట్టిన తర్వాత రచయిత దేవుపల్లి కృష్ణశాస్త్రి మనుమరాలు రేఖా సుప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కొడుకు పుట్టాడు. ఆమెకు విడాకులు ఇచ్చి కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి తమ్ముడి కూతురు రమ్యా రఘుపతిని మూడో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా మరో కొడుకు పుట్టాడు. ఈమెతోనూ భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి.. క్యారెక్టర్ ఆర్టిస్, ఒకప్పటి హీరోయిన్ పవిత్రా లోకేశ్‌తో సహజీవనం చేస్తున్నారు. నరేశ్‌కు పవిత్ర నాలుగో భార్య కాగా, ఆమెకు నరేశ్ మూడో భాగస్వామి కావడం గమనార్హం. పవిత్రా లోకేశ్‌కు మొదటి పెళ్లి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో జరిగింది. తర్వాత మనస్పర్థలతో విడాకులు తీసుకున్న ఆమె.. తర్వాత సుచీంద్ర ప్రసాద్‌తో 2018 వరకు సహజీవనం చేసి విడిపోయింది. ప్రస్తుతం నరేశ్‌లో కలిసి కాపురం చేస్తున్నది.

మెగా ఫ్యామిలీ పెళ్లి లెక్క

పవన్ కళ్యాణ్ 1997లో నందినిని, 2008లో హీరోయిన్ రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి విడాకులు ఇచ్చి రష్యన్ యువతి అన్నా లెజినివాను వివాహం చేసుకున్నాడు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మొదట శిరీష్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత విడిపోయింది. తర్వాత కళ్యాణ్ దేవ్‌తో వివాహమైంది. కళ్యాణ్ దేవ్‌కు కూడా ఇది రెండో పెళ్లి. వీరికి కూడా బిడ్డ పుట్టింది. నాగబాబు కూతురు నిహారిక మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.

అక్కినేని ఇంట పెళ్లీల పేరంటం

అక్కినేని నాగార్జున హీరో వెంకటేశ్ చెల్లెలు, రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత హీరోయిన్ అమలను పెళ్లి చేసుకోగా వీరి సంతానం అఖిల్. నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోని విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో హీరోయిన్ శోభితా ధూళిపాళని ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. త్వరలోనే వీరికి వివాహం జరుగనున్నది. అఖిల్ సైతం 2016లో జీవీకే అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయాభూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక.. వివిధ కారణాలతో అది క్యాన్సిల్ అయ్యింది.

ఇలా ఎందరో... 

సింగర్ సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భర్తకు విడాకులు ఇచ్చింది. చాలాకాలం తర్వాత ఇటీవల రెండో వివాహం చేసుకుంది. దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నాడు. నటుడు సామ్రాట్ రెడ్డి అంజనా శ్రీ లిఖితను రెండో వివాహం చేసుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిర ఉండగానే విజయ నిర్మలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి మరణం తర్వాత శ్యామలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం చనిపోయిన చాలా కాలం తర్వాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిని రెండో వివాహం చేసుకున్నారు. మోహన్ బాబు తన భార్య చెల్లినే రెండో వివాహం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ డిస్కోశాంతి చెల్లి లలిత కుమారిని వివాహం చేసుకుని విడిపోయారు. ఆయన కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్నారు. నిర్మాత, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు కూడా రెండో వివాహం చేసుకున్నారు. జెమినీ గణేషన్ మొదటి భార్య ఉండగానే మహానటి సావిత్రిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఆయన నాలుగు పెళ్లిళ్లు చేసుకుని రికార్డు సృష్టించారు. హేమా మాలినిని ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నాడు. సీనియర్ నటి లక్ష్మి కూడా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మరో సీనియర్ నటి జయంతి కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత తనకన్నా 25 సంవత్సరాల చిన్నవాడైన ప్రముఖ దర్శకుడిని మూడో వివాహం చేసుకుంది.

అన్ని చోట్లా ఇదే పరిస్థితి..

కోలివుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ గుత్తా జ్వాలను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇది ఇద్దరికి కూడా రెండో వివాహమే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మిర్జా ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని రెండో పెళ్లి చేసుకుంది. తమిళ హీరోయిన్ వనీత విజయ్ కుమార్ ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. తర్వాత సారికతో సహజీవనం చేసి శృతిహాసన్ పుట్టిన తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి ఆమెను కూడా విడిచిపెట్టిన కమల్ హాసన్ కొందరు హీరోయిన్లతో సహజీవనం చేసినట్లు టాక్. అలనాటి హీరోయిన్ రాధిక రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఆమె ప్రస్తుత భర్త శరత్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సీనియర్ నటుడు శరత్ కుమార్ నటి రమాప్రభను వివాహం చేసుకున్నాడు. తర్వాత స్నేహలతా దీక్షిత్‌ను వివాహం చేసుకోని ఆమెతోనూ విడిపోయాడు. స్టార్ హీరో కిశోర్ కుమార్ కూడా మధుబాలను రెండో వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా తర్వాత రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.

అభిమానులకు ఏం సందేశం ఇస్తున్నారు..?

సెలెబ్రిటీలకు ఫ్యాన్స్ కామన్. అదే స్టార్ హీరోలకు, హీరోయిన్‌లకు అయితే చెప్పాల్సిన పనిలేదు. లక్షల్లో, కోట్లల్లో కూడా అభిమానులు ఉంటారు. వారి సోషల్ మీడియా పేజీలకు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉంటారు. వీరంతా తన అభిమాన హీరో, హీరోయిన్ వేసే కాస్టూమ్స్, స్టైల్, లుకింగ్‌ను ఫాలో అవుతుంటారు. వారి కోసం ఏది చేయడానికైన తెగిస్తుంటారు. ఆరాధ్య దైవంగా భావిస్తూ గుండెల నిండా ప్రేమాభిమానాలను నింపుకుంటారు. మరి ఇంతటి అభిమానులు ఉన్న స్టార్స్ ఏమాత్రం తప్పటడుగు వేసినా వారిని పిచ్చి ప్రేమతో ఆరాధించే అభిమానులపై ఆ ప్రభావం ఉండక మానదు. తన అభిమాన హీరోనే చేస్తున్నాడు కదా.. నేను చేస్తే తప్పేంటి అనే భావన ఫ్యాన్స్‌లో వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. చాలా మంది స్టార్స్ ఒకటికి మించి పెళ్లిలు చేసుకుంటున్నారు. మరి కొందరు నాలుగేసి పెళ్లిలు చేసుకుని రికార్డులు తిరగరాస్తున్నారు. ఇంకొందరు సహజీవనం చేస్తున్నారు.

‘ఒక్క పెళ్లి’.. సంఖ్య తగ్గే అవకాశం?

గతంలో పెళ్లిని రద్దు చేసుకోవాలంటే ఎన్నో విధాలుగా ఆలోచించేవారు. ఆలోచనలు మైండ్‌లో రన్ అవుతుండేవి. ఫ్యామిలీ పరిస్థితి, పిల్లల భవిష్యత్తు అంటూ వారి కోసం ఆలోచించి.. కష్టమో, సుఖమో జీవించేద్దాం.. కాంప్రమైజ్ అయిపోదాం అని బతికేవారు. కానీ.. ఇప్పుడు మొదటిది వద్దు రెండోదే ముద్దు అన్నట్లు సమాజం తయారు అవుతున్నది. పెళ్లిలో ఉన్న గొప్పతనాన్ని, భవిష్యత్తు, బాధ్యతలను మరిచి విడాకులు తీసుకుంటున్నారు. ఇలా కేవలం హీరోహీరోయిన్లే కాదు.. దర్శక నిర్మాతలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఒకే దారిలో నడుస్తున్నారు. ఇక ఇలాంటివి ఆదర్శంగా తీసుకుంటే.. భవిష్యత్తులో పెళ్లిళ్లపై నమ్మకాలు పోయి దేశంలో ఏకపత్నీవ్రతులు అందరూ బహుపత్నీవ్రతులుగా మారకతప్పదేమో అని భయపడుతున్నారు కొందరు నెటిజన్లు.    


Similar News