19 ఏళ్లు.. వందకుపైగా చోరీలు.. ఆమె ఇంటర్వ్యూల కోసం టీవీ చానెల్స్ క్యూ

దిశ, వెబ్‌డెస్క్ : ఆమె పేరు చెబితే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో గుర్తు పట్టని పోలీస్ ఉండరు. వందల కేసుల్లో నిందితురాలు. లక్షల సొత్తును కొల్లగొట్టిన ఘనురాలు. ఆమె కోసం జైలు గోడల ఎత్తునే పెంచారంటే ఆమె చోర కళ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఎవరామే అనుకుంటున్నారా..? చెంచు లక్ష్మి(33). కరడుగట్టిన చోరురాలుగా పోలీస్ రికార్డుకెక్కిన ఈమె జైలు జీవితం అనంతరం మళ్లీ దొంగతనాలకు తెరలేపింది. చెంచు లక్ష్మి. ఈమె తన 14 ఏటనే […]

Update: 2021-05-11 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆమె పేరు చెబితే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో గుర్తు పట్టని పోలీస్ ఉండరు. వందల కేసుల్లో నిందితురాలు. లక్షల సొత్తును కొల్లగొట్టిన ఘనురాలు. ఆమె కోసం జైలు గోడల ఎత్తునే పెంచారంటే ఆమె చోర కళ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఎవరామే అనుకుంటున్నారా..? చెంచు లక్ష్మి(33). కరడుగట్టిన చోరురాలుగా పోలీస్ రికార్డుకెక్కిన ఈమె జైలు జీవితం అనంతరం మళ్లీ దొంగతనాలకు తెరలేపింది.

చెంచు లక్ష్మి. ఈమె తన 14 ఏటనే దొంగతనాలకు శ్రీకారం చుట్టింది. మొదట కూలి పనులు చేసే లక్ష్మి.. ఆ తర్వాత తన తల్లి వద్ద దొంగతనాల్లో తర్ఫీదు పొందింది. ఎక్కడ ఎలాంటి దొంగతనం ఎలా చేయాలో టెక్నిక్‌లు నేర్చుకుంది. చెట్లు ఎక్కడం, గోడలు దూకడంలో నైపుణ్యం పొందింది. గడ్డం లక్ష్మి, గోదావరి, గుండ్లపోచిగా పేర్లు మార్చుకుని 2004 నుంచి 2009 కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. 2004లో చెంచు లక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను మహిళా జైలులో వేస్తే 12 అడుగుల ఎత్తున్న జైలు గోడను దూకి పరారీ కావడానికి ప్రయత్నించింది. ఈ ఘటనతో రాష్ట్రంలోని అన్ని జైళ్ల గోడల ఎత్తును పెంచాల్సి వచ్చింది.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 100కు పైగా చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చింది. 2016లో చోరీ కేసుల్లో అరెస్ట్‌ అయిన చెంచులక్ష్మి మూడేళ్ల జైలు శిక్ష పూర్తికావడంతో నవంబర్‌ 2019లో జైలు నుంచి విడుదలైంది. జైలులో ఆమె ప్రవర్తనను గమనించిన అధికారులు తిరిగి నేరాల బాట పట్టకుండా సాధారణ జీవితం గడిపేందుకు మహిళ పెట్రోల్‌ బంకులో ఉపాధి కల్పించారు. అయినా ఆమె తీరు మారలేదు. దొంగతనాలకు పాల్పడి మరోసారి అరెస్టు అయింది.

తాజాగా మాదన్నపేటలోని కుర్మగూడలో రెండిళ్లలో దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. మాదన్నపేటలో ఉంటున్న చెంచు లక్ష్మి.. రెండున్నరేళ్లుగా మహిళా జైలు పెట్రోల్‌ బంకులో పనిచేస్తుంది. కాగా, వారం రోజులుగా ఆరోగ్యం బాగా లేదని పెట్రోల్‌ బంకుకు వెళ్లడం లేదు లక్ష్మి. ఈ నెల 7, 8 తేదీల్లో కుర్మగూడలో రెండు ఇళ్లతో పాటు గుడిలో చోరీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెంచులక్ష్మి చేసినట్లుగా గుర్తించిన మాదన్నపేట పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమె వద్ద నుంచి 9 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.11,520 నగదును స్వాధీనం చేసుకున్నారు.

కాగా, చెంచు లక్ష్మి దొంగతనాల చరిత్ర తెలుసుకున్న పలు తెలుగు టీవీ న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆమె జైలు జీవితం అనంతరం పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్న సమయంలో నిత్యం ఇంటర్వ్యూలు ఇస్తూ లక్ష్మి బిజీగా ఉండేది. తాను మారానని చెప్పుకున్న లక్ష్మి.. మళ్లీ దొంగతనాల బాట పట్టడం విషాధకరం.

Tags:    

Similar News