రాజధాని తరలింపుపై ముహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే..?
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటిస్తూ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. త్వరలోనే విశాఖ నుంచే పాలన కొనసాగుతుందని సీఎం జగన్‌తోపాటు పార్టీ కీలక నేతలు వెల్లడించారు. అయితే అది రోజు రోజుకు ఆలస్యమవుతుంది. కరోనాతోపాటు న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ఆ ప్రక్రియను కొంతకాలంపాటు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటిస్తూ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. త్వరలోనే విశాఖ నుంచే పాలన కొనసాగుతుందని సీఎం జగన్‌తోపాటు పార్టీ కీలక నేతలు వెల్లడించారు. అయితే అది రోజు రోజుకు ఆలస్యమవుతుంది. కరోనాతోపాటు న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ఆ ప్రక్రియను కొంతకాలంపాటు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన జూలై 23న విశాఖ నుంచి పరిపాలన సాగించడం దాదాపు ఖరారైనట్టేనని చెప్పుకొచ్చారు. అమరావతి నుంచి పరిపాలన ఎక్కువ రోజులు ఉండబోదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, భవనాలను మాత్రమే వినియోగిస్తామని తేల్చి చెప్పారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం ప్రైవేట్ భూములు అవసరం లేదని, వాటిపై ఆధారపడబోమని చెప్పారు. విశాఖలో ప్రభుత్వ భూములు చాలినంతగా ఉన్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇదే విషయాన్ని మే23న ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని.. విశాఖ పరిపాలన రాజధానిగా మారబోతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చని పరోక్షంగా ఆయన విశాఖ నుంచే పరిపాలన చేయబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు సీఆర్డీయే కేసులు రాజధాని తరలింపునకు అడ్డంకి కాబోదని కూడా స్పష్టం చేశారు.
ఆ తర్వాత జూలై23వ తేదీ టీడీపీకి కాళరాత్రి అని.. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోందని… ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో? అంటూ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. దీంతో జూలై 23న రాజధాని తరలింపు ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం అదే తేదీని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో రాజధాని తరలింపుపై ముహూర్తం కుదిరినట్టేనని ప్రచారం జరుగుతుంది.