పునర్వికాస దిశగా..నవనిర్మాణ సేన

           దేశ రాజధాని ఢిల్లీ అయినా..వాణిజ్య కేంద్రమైన ముంబై రాజధానిగా విరాజిల్లుతున్న మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ కొంత ఆసక్తిని కలిగిస్తుంటాయి. మహారాష్ట్రలో రాజకీయంగా, ఉపాధిపరంగా మరాఠీ ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీల్లో ‘శివసేన’ ఒకటి. 1960లో ‘శివసేన’ను స్థాపించిన బాల్ ఠాక్రే..అక్కడ మహారాష్ట్రేతరుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగించారు. స్థానికతే పునాదిగా బలమైన శక్తిగా ఎదిగారు. అయితే బాల్ ఠాక్రే కుమారుడు ‘ఉద్దవ్ ఠాక్రే’తో విభేదాల కారణంగా తన తమ్ముని […]

Update: 2020-02-09 05:09 GMT

దేశ రాజధాని ఢిల్లీ అయినా..వాణిజ్య కేంద్రమైన ముంబై రాజధానిగా విరాజిల్లుతున్న మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ కొంత ఆసక్తిని కలిగిస్తుంటాయి. మహారాష్ట్రలో రాజకీయంగా, ఉపాధిపరంగా మరాఠీ ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీల్లో ‘శివసేన’ ఒకటి. 1960లో ‘శివసేన’ను స్థాపించిన బాల్ ఠాక్రే..అక్కడ మహారాష్ట్రేతరుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగించారు. స్థానికతే పునాదిగా బలమైన శక్తిగా ఎదిగారు. అయితే బాల్ ఠాక్రే కుమారుడు ‘ఉద్దవ్ ఠాక్రే’తో విభేదాల కారణంగా తన తమ్ముని కుమారుడైన రాజ్ ఠాక్రే శివసేన నుంచి వైదొలిగి 2006లో సొంతంగా ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన’(ఎంఎన్‌ఎస్)ను స్థాపించి తనదైన మార్కు రాజకీయాలతో ఎంఎన్‌ఎస్‌ను పోటీలో నిలపగలిగారు. ఆ తర్వాత ఎంఎన్‌ఎస్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం హిందూత్వం వైపుగా మళ్లి పునర్వికాస దిశగా అడుగులు వేస్తోంది.

2006లో ఎంఎన్‌ఎస్‌ను స్థాపించిన ఠాక్రే..శివసేనతో ఎటువంటి వైరం లేదని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వలసొచ్చి రాజకీయంగా మరాఠీలపై ఆధిపత్యం చలాయిస్తున్న వారికి వ్యతిరేకంగా అనేక హింసాత్మక కార్యక్రమాలు సైతం చేపట్టారు. ముంబయిలో దుకాణాల సైన్‌బోర్డులన్నీ మరాఠీలో ఉండాలని హెచ్చరించారు. శివసేనలా కేవలం హిందూత్వమే ప్రధాన ఎజెండా కాకుండా అన్ని వర్గాల వారికి చేరువయ్యే విధంగా ఎజెండాను, కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో తన పార్టీ ఎజెండాను రూపొందించారు. అయితే మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘రాజ్ ఠాక్రే’ తన పార్టీ పంథాను మార్చుకుంటున్నట్టు గోచరిస్తున్నది. జనవరి 23న నిర్వహించిన ఎంఎన్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశంలో పార్టీ జెండాను కాషాయ రంగులోకి మారుస్తూ..నిర్ణయం తీసుకుని ‘హిందూత్వం నినాదం’ వైపు మళ్లినట్టు తెలపకనే తెలిపారు.

గతంలో ముందుగా మహారాష్ట్రీయులకు శుభాకాంక్షలు తెలిపి, తన ప్రసంగాన్ని మొదలుపెట్టే ‘రాజ్’… ప్రస్తుతం హిందువులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ రకంగా తన ఉద్దేశం, లక్ష్యాన్ని స్పష్టంగా చాటిచెప్పడంతో పాటు, ఫిబ్రవరి 9న బంగ్లాదేశీ, పాకిస్థానీ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారు అక్రమ చొరబాటుదారులని ఉద్ఘాటించడమూ పార్టీ హిందూత్వ విధానలను ప్రతిబింబిస్తోంది. విరుద్ధ భావజాలం కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కలిసి ‘మహా వికాస్ అగాది’ పేరుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రతిపక్ష పాత్ర బీజేపీకి దక్కింది. అయితే ఈ పార్టీల కలయికతో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు ఎంఎన్ఎస్ మెజారిటీతో కూడిన హిందూత్వ ఎజెండాను ఎత్తుకుంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలపై గల వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్న ఎంఎన్ఎస్ వ్యూహాలు తేటతెల్లమయ్యాయి. ఇది భవిష్యత్‌లో బీజేపీతో పొత్తుకు కూడా దారితీసే అవకాశాలను కాదనలేం.

1980లో సంఘ్‌పరివార్, బీజేపీలు రామమందిర ఉద్యమాన్నిలేవనెత్తగా.. మహారాష్ట్రలో శివసేన ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి బలపడింది. ప్రస్తుతం ఎంఎన్ఎస్‌కు సంస్థాగతంగా పట్టు, స్పష్టమైన రాజకీయ ఎజెండా, శివసేన వలె స్థిరత్వం లేకపోవడంతో ‘సీఏఏ, ఎన్నార్సీ’ని ఉయోగించుకుని గట్టెక్కాలని ఎంఎన్ఎస్ భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. 1980 తర్వాత శివసేన హిందూత్వం వైపు మళ్లడంతో తక్కువ కాలంలోనే అనుకూల ఫలితాలను పొందింది. అయితే హిందూత్వం, స్థానిక ఎజెండా మధ్య వైరుధ్యాలు క్రమంగా బయటపడటంతో అది ఎంఎన్ఎస్‌కు రాజకీయ లబ్దిని చేకూర్చింది. 2008లో ఉత్తరభారత రాష్ట్రాల నుంచి వలసొచ్చిన వారికి వ్యతిరేకంగా ‘ఎంఎన్‌ఎస్’ కఠినమైన స్టాండ్ తీసుకోవడంతో 2009 అసెంబ్లీ పోల్స్‌లో 13 స్థానాలు గెలుచుకోగలిగింది.

ఎంఎన్‌ఎస్ ప్రస్తుత స్టాండ్‌ పట్ల.. రాజ్ ఠాక్రే ‘దివంగత బాల్ ఠాక్రే పుస్తకం నుంచి ఒక పేజీని’ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని శివసేన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో హిందూత్వ నినాదంతో ఇప్పటికే శివసేన, బీజీపీ వంటి రెండు ప్రధాన పార్టీలుండగా.. ఓటర్లు ఇదే భావజాలం గల మరో పార్టీకి అవకాశం ఇస్తారా..అనేది ప్రశ్న. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో జతకట్టగా.. రాజ్ ఠాక్రే బీజేపీ వైపు చూస్తూ..ఎంఎన్ఎస్ పార్టీని పునర్వికాస దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అస్థిర విధానాల కారణంగా ఎంఎన్ఎస్ ప్రస్తుతం వెనకబడినా..హిందూత్వ నినాదంతో మళ్లీ పోటీలో నిలబడగలదా..? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది…!

Tags:    

Similar News