కదలని ఆటో ..
దిశ ప్రతినిధి, మెదక్ : లాక్ డౌన్ లో ఆటో కార్మికుల జీవన స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆటో చక్రం కదిలితేనే వారి బతుకు చక్రం సాగేది. కానీ లాక్ డౌన్ తో జిల్లాలో ఆటోలు నడవడం లేదు. గత 20 రోజులుగా ఇంటికే పరిమితమయ్యాయి. చాలా ఆటోలు ఫైనాన్స్ లో కొనడంతో లాక్ డౌన్ కారణంగా ఈఎంఐలు చెల్లించక పోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సిద్దిపేట పట్టణ […]
దిశ ప్రతినిధి, మెదక్ : లాక్ డౌన్ లో ఆటో కార్మికుల జీవన స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆటో చక్రం కదిలితేనే వారి బతుకు చక్రం సాగేది. కానీ లాక్ డౌన్ తో జిల్లాలో ఆటోలు నడవడం లేదు. గత 20 రోజులుగా ఇంటికే పరిమితమయ్యాయి. చాలా ఆటోలు ఫైనాన్స్ లో కొనడంతో లాక్ డౌన్ కారణంగా ఈఎంఐలు చెల్లించక పోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదిలా ఉండగా సిద్దిపేట పట్టణ ఆటో డ్రైవర్లకు మంత్రి హరీశ్ రావు నిత్యవసర సరుకులను అందించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరూ తమను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దెబ్బతిన్న ఉపాధి ….
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో కలిపి సుమారు పది వేల పై చిలుకు ఆటోలు ఉండగా 12 వేల వరకు ఆటో కార్మికులు ఉన్నారు. ఇందులో పట్టణాల్లో నడిచే ఆటోలు ఎక్కువగా అద్దెకు నడిపిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గత ఇరవై రోజుల నుండి లాక్ డౌన్ కారణంగా ఆటో కార్మికలు ఉపాధి కోల్పోయారు. పరిస్థితులు అన్ని బాగున్నప్పుడే డీజిల్ ఖర్చులు పోను రోజుకు రూ.రెండు, మూడు వందలు దొరికేవి. గత సంవత్సరం కాలంగా కరోనా కారణంగా చాలా మంది ఆటోలు ఎక్కేందుకు జంకుతున్నారు. ఇటీవలే కాస్త ఆటోలు ఎక్కేందుకు జనం సుముఖత చూపుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించడంతో వారి ఉపాధి దెబ్బతింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఆటోలకు గిరాకీ బాగానే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది.
ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి ….
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పది వేల వరకు ఆటోలు ఉండగా .. అందులో చాలా వరకు అద్దెకు నడుస్తుంటాయి. మరికొందరు ఫైనాన్స్ లో రుణం పొంది ఆటోలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం లా డౌన్ కారణంగా ఆటోలు నడవడం లేదు. ఇప్పటికే కుటుంబ పోషణ భారం కాగా దీనికి తోడు ఫైనాన్స్ కంపెనీలు తమ ఈఎంఐ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేయ్యగానే ఈఎంఐ చెల్లిస్తామని చెప్పిన వినడం లేదని పలువురు ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఎంఐల నుండి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.
పట్టణ డ్రైవర్లకు మంత్రి అండ ….
కరోనా కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు గతంలో జిల్లా ఆటో క్రెడిట్ కో ఆపరేటీవ్ సొసైటీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆటో సభ్యత్వం కల్గిన కార్మికులకు రుణం అందించారు . ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు పడుతున్న సిద్దిపేట పట్టణ ఆటో డ్రైవర్లకు 11 రకాల నిత్యవసర సరుకులు అందించారు. ఇది సంతోషించ దగ్గ విషయమే. కాగా మంత్రి సాయం సమాచారం తెలుసుకున్న జిల్లా ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలు కూడా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయి. తమను కూడా ఆదుకోవాలని పలు సామాజిక మాధ్యమాల వేదికగా మంత్రిని వేడుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆదుకోవాలి ….
లాక్ డౌన్‌తో మా ఆటో నడవడం లేదు. రోజు ఆటో నడిస్తేనే నాలుగు మెతుకులు నోట్లోకి పోతాయి. గత నెల రోజులుగా ఆటో నడుస్తలేదు. మళ్లీ పొడగించిర్రు. మా కుటుంబాన్ని పోషించుకోవడం మరింత కష్టంగా మారింది. మాపై మంత్రి హరీశ్ రావు దయచూపి మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
పి. రవి ఆటో కార్మికుడు
ఈఎంఐ ఇబ్బందవుతుంది ….
నేను ఫైనాన్స్‌లో లోన్ తీసుకొని ఆటో కొనుక్కున్న కొద్ది రోజులు బాగానే నడిచింది. ఇప్పుడు లాక్ డౌన్ పెట్టడంతోని ఆటో ఇంటికాడనే ఉంటుంది. ఉపాధి దెబ్బతింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు రోజు పది మాట్ల ఫోన్లు చేస్తున్నరు. ఈఎంఐ కట్టుడు ఇబ్బందవుతుంది. జర రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలి. కరోనా లాక్ డౌన్ ఎత్తెయ్యలి.
కే. సాయి కృష్ణ ఆటో కార్మికుడు