నాని, రామచంద్రయ్య మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయ్.. జాగ్రత్త

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ మంత్రి నాని, వైసీపీ నేత రామచంద్రయ్య మీ ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి… మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి జాగ్రత్తగా మాట్లాడాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Update: 2021-06-28 10:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ మంత్రి నాని, వైసీపీ నేత రామచంద్రయ్య మీ ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి… మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి జాగ్రత్తగా మాట్లాడాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా నీటిని ఆంధ్రకు చట్ట విరుద్ధంగా తరలించుకుపోతే హైదరాబాద్ లోని ఆంధ్రకు చెందిన నేతల అక్కాచెల్లెళ్లు, బంధువులు నీరెలా తాగుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉంటూ అన్నీ అనుభవిస్తున్న ఇక్కడి ఏపీ నేతలకు రాజధాని నీటి కష్టాలు పట్టవా ? అన్నారు. ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు కూడా ఏపీ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించాలని కోరారు.

పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇప్పడిప్పుడే పచ్చబడుతోందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తయితే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశలు పెట్టుకున్నారన్నారు. ఇంతలోనే పాలమూరు రైతుల ఆశలకు గండి కొట్టేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను తెలుగు గంగా ప్రాజెక్టు పేరుతో అక్రమంగా 44వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదనను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం ఇంకా దారుణమన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టా? హైడల్ ప్రాజెక్టా? అని ఏపీని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హైడెల్ పవర్ ప్రాజేక్ట్ యే అని స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

అందుకే 805 అడుగులనే హైడెల్ పవర్ కు బెంచ్ మార్క్ గా పెట్టారని, కానీ ఏపీ ప్రభుత్వం అంతకన్నా దిగువ నుంచి 797 అడుగుల్లో నీళ్ల తరలింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయగానే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం హైడల్ పవర్ పై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. కృష్ణాబోర్డును చోద్యం చూడటం తగదన్నారు. ట్రిబ్యునల్ ఏపీ అక్రమ ప్రాజెక్టుల పై స్టే విధిస్తే కృష్ణా బోర్డు ఏం చేస్తోందని, దాన్ని అమలు చేసే బాధ్యత బోర్డుది కాదా ? అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులను ప్రపంచ బ్యాంకుకు చూపించి నిధులు ఆంధ్రకు మళ్లించింది సమైక్య పాలకులు కాదా ? అన్నారు. ఆంధ్ర పాలకులు మంచి పరిపాలన చేసి.. అందరిని సమానంగా ఉంటే ప్రత్యేక తెలంగాణ అడిగేవారే కాదన్నారు. వారి వివక్షతతోనే ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలనేదే మా కోరిక అని, ఏపీ నేతలే అన్యాయంగా మాట్లాడుతూ రెచ్చ గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరును ఎడారి చేస్తామంటే ఎలా ఒప్పుకుంటామని… మాకు రాజకీయాలు లేకున్నా ఫర్వా లేదు ..ప్రాణాలు పోయినా లెక్క చేయమని నీళ్ల దోపిడీ పై మాట్లాడుతూనే ఉంటామన్నారు. వైసీపీ నేత రాంచంద్రయ్య కు తెలంగాణ కు జరిగిన అన్యాయాలు తెలియవా ? అని ప్రశ్నించారు. వైషమ్యాలు రెచ్చ గొట్టడం తగదని, సమైక్య పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయం గురించి ఇంకా వందేళ్లయినా మాట్లాడుతూనే ఉంటామన్నారు.

కాళేశ్వరం వైఎస్ కట్టిన ప్రాజెక్టు కాదని, ఆయన హయాంలో ప్రాణహిత చేవెళ్లకు తట్టెడు మన్ను తీయలేదని, కేసీఆర్ మేథోశక్తితో కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. వైఎస్ హయాంలో కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు దక్కాయి తప్ప తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. కృష్ణా రివర్ బోర్డు నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ ఫిర్యాదు చేయగానే శ్రీశైలంలో జల విద్యుత్ ఆపమని కృష్ణా బోర్డు ఎలా చెబుతుంది ?అని ప్రశ్నించారు. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ జల దోపిడీని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. మహబూబ్నగర్ కు నష్టం జరిగితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News