అప్రమత్తంగా ఉండండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగవద్దు : మంత్రి పువ్వాడ

దిశ, భద్రాచలం టౌన్ : వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలతో అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హుటాహుటిన మంత్రి భద్రాచలం విచ్చేసి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లాలో […]

Update: 2021-07-23 08:51 GMT

దిశ, భద్రాచలం టౌన్ : వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలతో అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హుటాహుటిన మంత్రి భద్రాచలం విచ్చేసి వరద ఉధృతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లాలో వరద స్థితిగతులపై మంత్రికి వివరించారు. గత మూడు రోజుల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షం పడిందని కలెక్టర్ చెప్పారు.‌ ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోందని, ఈ రాత్రికి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రేయింబవళ్ళు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

వరద పెరిగే వరకు వేచి చూడకుండా ముందస్తుగా పునరావాస ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాల్లో ప్రతీ ఒక్కరికి భోజనం, త్రాగునీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో అనుకోని అవాంతరాలు ఎటు వైపు నుంచి వస్తాయో తెలియదు.. కనుక అధికారులు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.‌ ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో ఉండాలని, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని డీఎంహె‌చ్‌వోని ఆదేశించారు. వీలైతే ఎక్కడికక్కడే ర్యాపిడ్ టెస్ట్స్ చేయాలని సూచించారు.

వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉంటాయని, మలేరియా, డెంగ్యూ, ఇతర విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా తీవ్ర జ్వరంతో బాధపడితే అది విస్తరించక ముందే వారిని గుర్తించి తక్షణమే వైద్యం అందించాలన్నారు. గ్రామాలలో, పట్టణాల్లో పారిశుధ్యం ఎప్పటికప్పుడు చేపట్టాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. భారీ వర్షాలకు రోడ్ల మీదకు వరదలు వచ్చిన చోట ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని, అలాంటి చోట్ల ప్రజలు రాకపోకలు సాగించకుండా పోలీసులు ప్రమాద హెచ్చరికలు పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు.

చెరువులు, కుంటలు, వాగుల వద్ద బలహీనంగా ఉన్న కట్టలను గుర్తించి తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతున్నందున తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, ఇక ముందు కూడా జరగకుండా చూడాలన్నారు.

శనివారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజాహితంతో ముక్కోటి వృక్షార్చనకు పిలుపు ఇచ్చినందున పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని‌ మంత్రి సూచించారు. విద్యుత్ వైర్లు వేలాడకుండా, ప్రమాదం కలిగించే విధంగా ఉండకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ రాత్రికి జిల్లా కలెక్టర్ భద్రాచలంలో మకాం చేసి వరదని అంచనా వేస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తారని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News