ఆరోగ్యశాఖలో ప్రక్షాళన.. మంత్రి హరీష్ తనదైన మార్క్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హరీశ్‌రావు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆ శాఖను క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతీ అంశంపై గ్రౌండ్ లెవల్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఆఫీసర్లు ఇచ్చిన నివేదికలతో పాటు స్థానిక ప్రజలు ,టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి కూడా మంత్రి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు చెప్పిన దానికి, వాస్తవిక పరిస్థితుల్లో తేడా కనిపిస్తే సదరు విభాగాపు హెచ్‌ఓడీలపై […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హరీశ్‌రావు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆ శాఖను క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతీ అంశంపై గ్రౌండ్ లెవల్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఆఫీసర్లు ఇచ్చిన నివేదికలతో పాటు స్థానిక ప్రజలు ,టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి కూడా మంత్రి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు చెప్పిన దానికి, వాస్తవిక పరిస్థితుల్లో తేడా కనిపిస్తే సదరు విభాగాపు హెచ్‌ఓడీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నిర్లక్ష్యం, సేవల్లో జాప్యం జరగడానికి గల కారణాలను వెంటనే నివేదిక రూపంలో ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో ఆరోగ్యశాఖ రివ్యూల్లో మంత్రి ఎప్పుడు ఏం అడుగుతారోనని హెల్త్ హెచ్ఓడీలు టెన్షన్ పడుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడాల్సిన అవసరం లేదని మంత్రి ఆఫీసర్లకు నొక్కి చెప్తున్నారు. ఇక నుంచి ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం జరిగినా, సేవల్లో ఇబ్బందులు కలిగినా చర్యలు తప్పవని మంత్రి హెచ్ఓడీలకు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఇన్నాళ్లు నెమ్మదిగా ఉన్న అధికారులు హరీశ్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
జిల్లాల పర్యటనలేవి?
ఆసుపత్రుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతీనెలా జిల్లాలు విజిట్ చేయాలని మంత్రి హరీశ్‌రావు గతంలో హెల్త్ హెచ్ఓడీలకు సూచించారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో మంత్రి ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్‌ఓడీలపై సీరియస్ అయినట్లు సమాచారం. జిల్లాల్లో తనిఖీలు చేయకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈక్రమంలో మంత్రి నుంచి ఫోన్లు వస్తే చాలు అధికారులు హడలెత్తిపోతున్నారు. అయితే ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం హరీశ్స్పెషల్ ఆపరేషన్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చితే పేదలకు మెరుగైన వైద్యం అందడమే కాకుండా సిబ్బంది సమస్యలు కూడా ఒక్కోటి పరిష్కారం అవుతున్నట్లు వివరిస్తున్నారు.
స్పీడ్‌గా సౌకర్యాలు…
ఈ ఏడాది నవంబరు 10 తేదీన మంత్రి హరీశ్ ఆరోగ్యశాఖ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి ఆసుపత్రుల్లోని పెండింగ్ సమస్యలు ఒక్కోటిగా పరిష్కారం కావడమే కాకుండా, నూతన పరికరాలు, వార్డులు, కొత్త ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. ఉస్మానియా, ఎంజీఎం, గాంధీలో దాదాపు రెండేళ్లుగా మోరాయించిన క్యాథ్ ల్యాబ్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు. ఇప్పటికే ఉస్మానియా, ఎంజీఎంలో ఆపరేషన్లు షురూ కాగా, గాంధీ, ఖమ్మం , ఆదిలాబాద్‌లో అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్ సెంటర్లను పెంచాలని నిర్ణయించారు. ఆర్థిక, వైద్యానికి రెండూ ఆయనే ఉండటంతో కొత్త ప్రాజెక్టులు వేగంగా మంజూరు అవుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
ఈ టాస్కే లక్ష్యం..
సర్కార్ దవాఖాన్లలో పేషెంట్లకు మరింత భరోసా కల్పించేందుకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధికారులు, నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నారు. దీంతో పాటు శానిటేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆసుపత్రులు క్లీన్‌గా లేకపోతే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అంతేగాక ఆసుపత్రుల్లో లంచాలు తీసుకుంటున్న వారిపై కూడా మంత్రి దృష్టి పెట్టారు. ప్రత్యేక నిఘా టీంను పెట్టారు. రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రుల్లోనూ మంత్రి అకస్మిక తనిఖీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.