మంత్రి మల్లారెడ్డా.. మజాకా.. క్యూ కట్టాల్సిందే..
దిశ, తెలంగాణ బ్యూరో : ఆయన రాష్ట్రానికి కార్మిక మంత్రి. కార్మికుల కష్టాలను తెలుసుకొని సంక్షేమం గురించి ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలోని ఆస్పత్రుల అభివృద్ధిని పట్టించుకోవాలి. ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరిన వారిని రకరకాల కారణాలతో ‘రిఫరల్ పేషెంట్లు’గా సొంత దవాఖానకు తరలించుకుంటారు. ఈఎస్ఐకి సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఉన్నా.. డీన్ కు మాత్రం నారాయణ ఆస్పత్రిమీదే అభిమానం ఎక్కువ. అందుకే సగం ’రిఫరల్ కేసులు’ ఆ మంత్రి దవాఖానకే వెళ్తాయి. మంత్రి మల్లారెడ్డా.. మజాకా! […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆయన రాష్ట్రానికి కార్మిక మంత్రి. కార్మికుల కష్టాలను తెలుసుకొని సంక్షేమం గురించి ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలోని ఆస్పత్రుల అభివృద్ధిని పట్టించుకోవాలి. ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరిన వారిని రకరకాల కారణాలతో ‘రిఫరల్ పేషెంట్లు’గా సొంత దవాఖానకు తరలించుకుంటారు. ఈఎస్ఐకి సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఉన్నా.. డీన్ కు మాత్రం నారాయణ ఆస్పత్రిమీదే అభిమానం ఎక్కువ. అందుకే సగం ’రిఫరల్ కేసులు’ ఆ మంత్రి దవాఖానకే వెళ్తాయి. మంత్రి మల్లారెడ్డా.. మజాకా! మంత్రి కాకముందు ఆయన ఆస్పత్రి ఈఎస్ఐలో ఎంప్యానెల్‌మెంట్ లిస్టులో కూడా లేదు.
కానీ మంత్రికాగానే పనులన్నీ చకచకా జరిగిపోయాయి. చిరుద్యోగులు నెలనెలా జీతం నుంచి కూడబెట్టుకున్న డబ్బుల్లో ఈఎస్ఐ కోసం చెల్లిస్తూ ఉంటారు. ఆపద కాలంలో ఈఐఎస్ఐ దవాఖాన ఆదుకుంటుందని వారికి నమ్మకం. వివిధ రకాల అనారోగ్య కారణాలతో సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్ళిన పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కూడా ఉంది. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు బండారు దత్తాత్రేయ ఈ ఆస్పత్రిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు. ‘ప్రతీ ఐపీ (ఇన్సూర్డ్ పర్సన్) మాకు వీఐపీయే’ అని గర్వంగా చెప్పేవారు. దానికి తగినట్లుగానే మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు గుర్తింపు తెచ్చారు.
డయాలసిస్ కేసులు కూడా ప్రైవేటుకే!
రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా డీన్ సహకారంతో మంత్రి మల్లారెడ్డికి చెందిన జీడిమెట్ల (సూరారం) నారాయణ ఆసుపత్రి స్పెషాలిటీ వార్డులు ఈఐఎస్ రిఫరల్ పేషెంట్లతో కళకళలాడుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి 26 మంది పేషెంట్లు ‘రిఫరల్’ పేరుతో మల్లారెడ్డి ఆస్పత్రిలో చేరారు. ఇందులో పన్నెండు కార్డియాలజీ విభాగానికి సంబంధించిన కేసులే. ఎనిమిది కేసులు డయాలసిస్‌వి. మిగిలినవి న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితరాలకు సంబంధించినవి. ఈఎస్ఐకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నా నెలకు సగటున పాతికకు పైగా కేసులు మల్లారెడ్డి ఆస్పత్రికి మరో సగం ఇతర ఆస్పత్రులకు ‘రిఫరల్’ పేరుతో ఎందుకు వెళ్తున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈఐఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నయం చేయడానికి వీలుకాని, నిర్దిష్ట వ్యాధికి సంబంధించిన వార్డులు, స్పెషలిస్టులు లేనప్పుడు ప్రైవేటు దవాఖానలకు పంపడానికి ఎలాంటి ఆంక్షలూ లేవు. మొత్తం ముప్పై ‘ఎంప్యానెల్ ’ ఆస్పత్రులు ఉంటే ఇందులో మూడు వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రైవేటువి. మరో మూడు క్యాన్సర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. మిగిలిన 24 హైదరాబాద్ నగరానికి చెందిన ప్రవేటు ఆసుపత్రులే. ప్రతి నెలా రిఫరల్ పేరుతో వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న కేసుల్లో దాదాపు సగం (సగటున) ఒక్క మల్లారెడ్డి నారాయణ దవాఖానకే వెళ్తున్నాయి. అయితే అధికారికంగా వివరాలను వెల్లడించడానికి మాత్రం డీన్ అందుబాటులో లేరు.
మల్లారెడ్డి ఆసుపత్రికి డైరెక్ట్ రిఫరెన్స్
పేషెంట్లకు అవసరమైన ట్రీట్‌మెంట్ ఈఎస్ఐ ఆసుపత్రిలో లేనప్పుడు వారి అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ ప్రైవేటు ఆస్పత్రి రిఫర్ చేయాలన్నది నిబంధన. పేషెంట్ ఇంటికి ఏ ఆస్పత్రి దగ్గరగా ఉంటుంది, వారికి ఏది సౌకర్యంగా ఉంటుంది తదితరాలను పేషెంట్లను అడిగి వారి సమ్మతికి తగినట్లుగా ఆ ఆస్పత్రి రిఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనతో సంబంధం లేకుండా నేరుగా మల్లారెడ్డి ఆస్పత్రి రిఫర్ చేయడం ఒక అలవాటుగానే మారిపోయింది అక్కడి డాక్టర్లకు. ఆపదలో ఉన్న పేషెంట్లు, వారి సహాయకులు తొందరగా నయమైతే చాలనుకుని ప్రైవేటు ఆస్పత్రి ఏదైనా వెళ్లడానికి సిద్ధపడుతుంటారు. పైగా ఈఎస్ఐ ఆసుపత్రిలో డీన్ చెప్పిందే డాక్టర్లందరికీ వేదం. ఆయన సహాయ సహకారాలతో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి కాసులు కురిపిస్తోంది. ఈఎస్ఐ ఆసుపత్రిలో నయంకాని వ్యాధులకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సీజీహెచ్ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్) రేట్ల ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ఆ ఛార్జీలు ప్రైవేటు ఆసుపత్రులకు లాభాలు కురిపించవు. అందుకే పేషెంట్ల ఆతృత, బలహీనతలను సొమ్ము చేసుకుని వెంటిలేటర్, ఆక్సిజన్, స్పెషలిస్టు కన్సల్టెన్సీ లాంటి అదనపు ఛార్జీలతో బిల్లులు వేస్తుంటాయి. ఈ అదనపు ఛార్జీలే ప్రైవేటు ఆసుపత్రులకు లాభాలు ఆర్జించి పెడుతున్నాయి.
‘జీరో రిఫరల్’ అంటూనే పదుల సంఖ్యలో ప్రైవేటుకు
సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి డీన్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ పలు సందర్భాల్లో తాను బాధ్యతలు తీసుకోకముందు భారీ సంఖ్యల్లో ‘రిఫరల్ పేషెంట్లు’ ఉండేవారని, తాను వచ్చిన తర్వాత ‘జీరో రిఫరల్’ చేశానంటూ గొప్పగానే చెప్పుకున్నారు. కానీ ’గాంధీ’, ’నిమ్స్ ’, ‘ఉస్మానియా ’ తదితర ఆసుపత్రులతో పాటు దాదాపు 30 ప్రైవేటు దవాఖానలకు ప్రతి నెలా పేషెంట్లు వెళ్తూనే ఉన్నారు. ఒక్క మార్చిలోనే మల్లారెడ్డి నారాయణ దవాఖానకు 26 కేసులు ఎందుకు వెళ్లాయనేది ప్రస్తావించదగిన అంశం. ఔట్ పేషెంట్లుగా వచ్చినవారి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంటే వెంటనే దాన్ని ఎమర్జెన్సీ ఓపీగా ప్రకటించి క్యాజువాలిటీకి తరలిస్తుంటారు. అక్కడి నుంచి ప్రైవేటు దవాఖానకు ’రిఫరల్ ’ పేషెంట్లుగా వెళ్లిపోతుంటారు. ప్రతినెలా సగటున 150 మంది దాకా ఔట్ పేషెంట్లుగా, వంద మంది వరకు ఇన్ పేషెంట్లుగా వస్తుంటారు.
ఇందులో దాదాపు ముప్పై శాతం రిఫరల్ కేసులుగా ప్రైవేటుకు వెళ్తుంటాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగానికి ప్రత్యేక యూనిట్, డాక్టర్లు ఉన్నప్పటికీ రెండేళ్లుగా ఆ యూనిట్‌లో సాంకేతిక కారణాలను చూపి దాని పని సామర్థ్యాన్ని తగ్గించారని, ఆ ప్రాతిపదికన ‘రిఫరల్’ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు పేషెంట్లను పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ మార్చి నెల వివరాలను చూసిన తర్వాత ఆ ఆరోపణలకు బలం చేకూరింది. మార్చి నెల వివరాలను పరిశీలిస్తే నాల్గవ తేదీన రెండు, ఐదవ తేదీన మూడు, ఆరవ తేదీన మూడు, ఏడవ తేదీన రెండు, 22వ తేదీన నాలుగు, 24వ తేదీన మూడు చొప్పున మల్లారెడ్డి ఆసుపత్రికి ’రిఫరల్ పేషెంట్లు’ వెళ్ళారు. మంత్రి మల్లారెడ్డికి, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డీన్‌కు మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ మర్మమేంటనేది చర్చనీయాంశమైంది.