‘లోఫర్లు, జోకర్లు, బ్రోకర్ల మాటలకు ప్రజా క్షేత్రంలో విలువ లేదు’
దిశ, సూర్యా పేట : టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే దమ్ము ఏ ఒక్కరికీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్ మోడల్ గా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది లోఫర్లు, జోకర్లు, బ్రోకర్ల మాటలకు ప్రజా క్షేత్రంలో విలువ లేదని ఆయన కొట్టిపడేశారు. సెప్టెంబర్ 2న జరగనున్న జెండా పండుగను విజయవంతం చేయడంలో భాగంగా ఆదివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో […]
దిశ, సూర్యా పేట : టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే దమ్ము ఏ ఒక్కరికీ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్ మోడల్ గా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది లోఫర్లు, జోకర్లు, బ్రోకర్ల మాటలకు ప్రజా క్షేత్రంలో విలువ లేదని ఆయన కొట్టిపడేశారు. సెప్టెంబర్ 2న జరగనున్న జెండా పండుగను విజయవంతం చేయడంలో భాగంగా ఆదివారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ లీడర్, క్యాడర్ తో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్ తో పాటు జీవీవీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వాలు రెండూ వేరు వేరు కాదని పార్టీనే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నది గులాబీ సైన్యం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోనే అధికారంలోకి వచ్చాకా అమలు పరుస్తారని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది కుడా అదేనని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ టీఆర్ఎస్ పార్టీ రూపొందించినవేనని ఆయన తేల్చిచెప్పారు. అటువంటి గులాబీ జెండాయే ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. యావత్ భారతదేశంలోనే తెలంగాణను ముందు వరుసలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే నైతికత ఏ ఒక్కరికీ లేదు అన్నారు. అటువంటి పార్టీల జెండాలు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయన్నారు. అటువంటి పార్టీలకు తెలంగాణాలో కాలం చెల్లిందని ప్రతి చోట ఎగరాల్సింది ఒక్క గులాబీ జెండాయే అన్నది టీఆర్ఎస్ పార్టీ లీడర్, క్యాడర్ గుర్తించాలని ఆయన చెప్పారు.
పథకాల అమలులో గులాబీ సైన్యం టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ది పొంది మరో పార్టీ జెండాలు మోస్తున్న వారిని నిలదీయాలని ఆయన క్యాడర్ కు ఉద్బోధించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న పార్టీలు అన్ని ప్రభుత్వ పథకాలను వారి వారి క్యాడర్ కు పందేరంలా పంచి పెట్టేవారని విపక్ష పార్టీలకు ఎమ్మార్వో కార్యాలయాల్లో నో ఎంట్రీ ఉండేదని ఆయన గుర్తుచేశారు.