కరోనా కట్టడి: అధికారులకు మంత్రి హరీష్ కీలక ఆదేశాలు
దిశ, పటాన్ చెరు: జిల్లాలో కరోనా నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య ఆరోగ్య, పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనా నివారణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనుల ప్రారంభానికి ఏర్పాట్లు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు, ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్, మందులు, […]
దిశ, పటాన్ చెరు: జిల్లాలో కరోనా నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య ఆరోగ్య, పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనా నివారణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనుల ప్రారంభానికి ఏర్పాట్లు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు, ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్, మందులు, బెడ్స్ అందుబాటుపై డిఎం అండ్ హెచ్ఓను ఆరా తీశారు. జిల్లాలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు శాతానికి తగ్గిందని డిఎం అండ్ హెచ్ఓ తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో ఏదైనా మండలం, మున్సి పాలిటీలో కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ కోవిడ్ టెస్టులను అధికం చేయాలని, ఇంటింటి సర్వే చేసి లక్షణాలున్నవారికి కోవిడ్ కిట్‌ను అందజేయాలన్నారు.
అదే విధంగా పోలీసులు సామూహిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని, ప్రజలు మాస్కులు ధరించడం, బయట తిరగకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలన్నారు. కేసులు ఎక్కువగా వస్తున్న ఏరియాలపై దృష్టి సారించాలన్నారు. జోగిపేట సంగారెడ్డి, పటాన్ చెరు సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలలో మూడవ దశ ఇంటింటి సర్వే నిర్వహించాలని, టెస్టులను పెంచాలని, లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో 28 వేల మందిని హై రిస్క్ గ్రూపుగా గుర్తించడం జరిగిందని, ఇప్పటివరకు 12 వేల మందికి వ్యాక్సినేషన్ చేశారని, వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి కావాలన్నారు.
కోవిడ్ బాధితులకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలని, ఆత్మీయ పలకరింపుతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలని వైద్యులకు సూచించారు. కోవిడ్ వార్డులో డ్యూటీ అర్ఎంఓ, హాస్పిటల్ సూపరిండెంట్ రోజుకొకసారి రౌండ్ చేయాలని సూచించారు. కోహిర్ పిహెచ్ సి, నారాయణఖేడ్ ఎంసిహెచ్ ఆస్పత్రులను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలు సాగు అయిందని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో 99 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన ఒక్క శాతం ధాన్యాన్ని రెండు రోజుల్లోగా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డికి సూచించారు. సంగారెడ్డి జిల్లాలో జొన్నలు కొనడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
జొన్నల కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు కనీసం 250 ఎకరాల భూమి కావాలని, స్థల సేకరణపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కు, సంబంధిత ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. ఈ నెల 12న సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.