ఎవరో నిర్ణయించిన ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది: హరీశ్ రావు
దిశ, మెదక్: నీళ్లు ఇవ్వని పార్టీలు మాట్లాడుతాయా..? రైతులకు ఒక్కరూపాయి ఇవ్వని నేతలు మాట్లాడుతారా..? రైతులకు అన్నీ సమకూర్చిన మేము మాట్లాడాలా..? రైతులకు ఏమీ ఇవ్వని ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బైరీ అంజయ్య గార్డెన్స్ లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం 2020 నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు, వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన […]
దిశ, మెదక్: నీళ్లు ఇవ్వని పార్టీలు మాట్లాడుతాయా..? రైతులకు ఒక్కరూపాయి ఇవ్వని నేతలు మాట్లాడుతారా..? రైతులకు అన్నీ సమకూర్చిన మేము మాట్లాడాలా..? రైతులకు ఏమీ ఇవ్వని ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని బైరీ అంజయ్య గార్డెన్స్ లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం 2020 నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు, వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. రైతుకు ఒక్క రూపాయి ఇవ్వని విపక్షాల మాటలను రైతులు విశ్వసించరన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే ఆలోచన చేస్తుందని, ప్రభుత్వం ప్రజల మీద తల్లిదండ్రిలా వ్యవహరిస్తుందన్నారు. సబ్బు, అగ్గిపెట్టే ఇలా.. ఎవరు ఏ వస్తువు తయారు చేస్తే ఆ మనిషే తన వస్తువు ధర నిర్ణయిస్తున్నారు.. కానీ రైతు మాత్రం ఎవరో నిర్ణయించిన ధరకే రైతు అమ్ముకోవాల్సిన దుస్థితి తలేత్తిందన్నారు. 7 వేల రూపాయల కోట్లను రైతుబంధు కోసం బడ్జెట్ లో పెట్టామని, రైతులందరికీ అందిస్తామన్నారు. వానా కాలం పంటకు 7 వేల కోట్లు రైతులకు ఇవ్వనున్నామన్నారు. యాసంగిలో మక్క వేయండి. వానా కాలంలో పత్తి, వరి, పెసర, కందులు వంటి పంటలు వేద్దామన్నారు. రైతులకు లాభం చేకూర్చడానికే ప్రభుత్వం ద్వారా విద్యుత్, గోదాములు, సాగునీరు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని ఇబ్బందులు లేవని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్ల కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తే.. ఎకరాకు 15 క్వింటాళ్ల పంట వస్తుందన్నారు. అమెరికాలో చాలా దశల్లో పత్తి నిల్వలు తగ్గాయి.. పత్తికి డిమాండ్ ఉంటుందని నిర్ధారణలు చెబుతున్నాయి.. ఇది గమనించిన రైతులు పత్తి సాగువైపు మొగ్గు చూపాలన్నారు. రైతు తల ఎత్తుకుని తన పంట ధర తానే నిర్ణయించుకునే పరిస్థితి రావాలి.. ఈ పరిస్థితి రావాలంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడాలని.. రైతులను చైతన్యపర్చాలని మంత్రి పిలుపునిచ్చారు. సన్న రకాలు ప్రోత్సహించాలని, వరి గింజ 6.3 మిల్లీ మీటర్ల పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్, ధర ఉంది.. ఆ విత్తనాలను ప్రభుత్వం త్వరలోనే అందుబాటులో తెస్తుందన్నారు. రైతుబంధుకు నిధుల కొరత లేదని, కోటి 40 లక్షల ఎకరాలకు గానూ ఎకరాకు రూ.5 వేల చొప్పున్న రూ.7 వేల కోట్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు. రూ. 3500 కోట్లు రైతులకు విడుదల చేస్తున్నామన్నారు. దేశంలో సరిపడా ఫామాయిల్ ఉత్పత్తి లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, జిల్లాలోనూ ఫామాయిల్ సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. కంది పంటను రూ.5800 మద్దతు ధరతో ప్రభుత్వమే కొంటుందన్నారు.