ఆ మంత్రిని మరో వివాదంలో ఇరికిస్తున్న పీఎస్..!
దిశ ప్రతినిధి, మెదక్: ఓ మంత్రి వద్ద పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సొంత గ్రామంలో ఆదిపత్యం చేలాయిస్తున్నాడు. సర్పంచ్‌లను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు.. భారీగా నిధులను మంజూరు చేయించుకొని.. అభివృద్ధి పేరుతో రూ.కోట్లు సంపాదించినట్టు టాక్. ఇంతకీ అతడు ఎవరో కాదు.. ఏకంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వద్ద పనిచేసే పీఎస్(పర్సనల్ సెక్రటరీ) కావడం గమనార్హం. ఈయన తీరుతో సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. […]
దిశ ప్రతినిధి, మెదక్: ఓ మంత్రి వద్ద పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సొంత గ్రామంలో ఆదిపత్యం చేలాయిస్తున్నాడు. సర్పంచ్‌లను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు.. భారీగా నిధులను మంజూరు చేయించుకొని.. అభివృద్ధి పేరుతో రూ.కోట్లు సంపాదించినట్టు టాక్. ఇంతకీ అతడు ఎవరో కాదు.. ఏకంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వద్ద పనిచేసే పీఎస్(పర్సనల్ సెక్రటరీ) కావడం గమనార్హం. ఈయన తీరుతో సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట జిల్లా గిర్మాపూర్‌కు చెందిన సత్యనారాయణరెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వద్ద పీఎస్‌గా పనిచేస్తూ.. ఏకంగా సొంత గ్రామాన్ని అదుపులోకి తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన ఆ శాఖ మంత్రే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు నిదర్శనం.. సొంత గ్రామానికి సత్యనారాయణరెడ్డి భారీగా నిధులు మంజూరు చేయించుకున్న విషయాన్ని సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం నాయకులు ఆధారాలతో బయటపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాకు రూ. 2.66 కోట్లు.. అందులోనూ..
సిద్దిపేట జిల్లా పరిధి 20 మండలాల్లో 499 గ్రామాలు ఉన్నాయి. కానీ, ఇందులో కేవలం 11 గ్రామాలకు ఇటీవల 13 సీసీ రోడ్లు మంజూరు అయ్యాయి. అందులోనూ గిర్మాపూర్ గ్రామానికే 3 సీసీ రోడ్లు మంజూరు కావడం విశేషం. ఈ క్రమంలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, అధికారులను తప్పుదోవ పట్టించి సత్యనారాయణరెడ్డి గ్రామానికి అధికంగా నిధులు మంజూరు చేయించుకున్నాడని.. సొంత గ్రామంలో సీసీ రోడ్ల పేరు మీద రూ. 80 లక్షలు, మండలం పేరు మీద మరో రూ. 30 లక్షలు కలిపి.. మొత్తంగా రూ. కోటి 10 లక్షలు మంజూరు చేయించుకోవడం చర్చకు దారి తీసింది. 499 గ్రామాల్లో ఒక్క గ్రామానికి మూడు సీసీ రోడ్లు, భారీగా నిధులు మంజూరు చేయడం ఏంటని ఓ వైపు అధికారులపై ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
సీఎం చెప్పినా మార్చలేదు.. అతడే కంటిన్యూ..
ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వద్ద పీఎస్‌గా పనిచేస్తున్న సత్యనారాయణరెడ్డి.. గతంలో మాజీ మంత్రులైన జీవన్ రెడ్డి , సునీతా లక్ష్మారెడ్డిల వద్ద కూడా పనిచేశాడు. ఇది ఇలా ఉంటే.. టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన పీఎస్‌లను తీసుకోవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు అమలులో ఉన్నాయి. అయినా సీఎం ఆదేశాలు ఉల్లంఘిస్తూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.. తన పీఎస్‌గా సత్యనారాయణరెడ్డిని నియమించుకోవడంపైననూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో కూడా రూ. కోట్లాది రూపాయలు స్వగ్రామానికి మంజూరు చేయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. కోట్ల రూపాయలు సంపాదించాడని సిద్దిపేట జిల్లా సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఆ పీఎస్‌పై వెంటనే సంబంధిత మంత్రి చర్యలు తీసుకోవాలని.. పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్పంచుల ఫోరం అధ్యక్షుడి వివరణ..
ఈ విషయంపై సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆరేపల్లి మహాదేవను వివరణ కోరగా.. ‘ఇది పూర్తిగా మాకు అన్యాయం చేయడమే. ఒక్క గ్రామానికి మూడు సీసీ రోడ్లు మంజూరు చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది.. దీనిపై వెంటనే సీఎం చర్యలు తీసుకోవాలి. మంత్రి పీఎస్ అయితే.. అలా మంజూరు చేయించుకోవడం సరికాదు. మిగతా గ్రామాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాను’.