కరోనా కట్టడికి ప్రభుత్వం రెడీ : ఎర్రబెల్లి
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులతో కలిసి కరోనా వైరస్ నియంత్రణపై వరంగల్ హంటర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కరోనా వైరస్ విస్తృతిపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 81శాతం మంది కరోనా బాధితుల్లో ఏమాత్రం వైరస్ లక్షణాలు […]
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులతో కలిసి కరోనా వైరస్ నియంత్రణపై వరంగల్ హంటర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా కరోనా వైరస్ విస్తృతిపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 81శాతం మంది కరోనా బాధితుల్లో ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించడం లేదన్నారు. అందులో కేవలం 19 శాతం మందికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. 14 శాతం మందికి కోలుకుంటున్నారని, కేవలం 4 నుంచి 5శాతం అంతకు ముందే జబ్బులున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే సమస్య తీవ్రంగా ఉందన్నారు. వాళ్ళను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డాక్టర్లు, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఇక నుంచి 24 గంటల పాటు కరోనాకు చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఉండాలని, ఏ జిల్లాలోని కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే చికిత్సలు అందించాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని, కావాల్సిన ఇండెంట్లు పెట్టాలని, ఏ ఒక్క పేషెంట్‌కు కూడా వైద్యం అందలేదన్న పేరు రావొద్దని మంత్రి స్పష్టంచేశారు.
సహజ మరణాలను కరోనా మరణాలుగా చూడొద్దు..
ప్రతిరోజూ దేశంలో 3 వేల మంది, రాష్ట్రంలో వెయ్యి మంది సహజంగా మరణిస్తున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మరణం కరోనా వల్లే అనడం సబబు కాదన్నారు. ప్రతి ప్రభుత్వ దవాఖానాలో ఆడిట్ కమిటీ ఉంటుందని, ఆ కమిటీయే ఆయా మరణాలను నిర్ధారిస్తుందన్నారు. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్ళి లక్షలు తగలేసుకోవద్దని, నిజానికి కోవిడ్‌కు మందు లేదని వివరించారు.
నిదమ్ యాప్ ఏర్పాటు..
ప్రభుత్వం నిదమ్ యాప్‌ను సిద్ధం చేసిందని మంత్రి చెప్పారు. ఫోన్‌లో ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ సమస్యలు చెప్పి, కావాల్సిన సలహాలు, సూచనలు రిటైర్డ్ సీనియర్ డాక్టర్ల నుంచి తీసుకోవచ్చని ఎర్రబెల్లి సూచించారు.ఈ యాప్ హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్ళకి, ఇళ్ళల్లోనే ఉండే వారందరికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని, ధైర్యంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఎంజీఎంపై ప్రత్యేక సమీక్ష..
మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంజీఎం హాస్పిటల్ పై ప్రత్యేకంగా చర్చించారు. నిబద్ధత, నిజాయితీ, సమన్వయంతో పని చేయాలని ఎంజీఎం డాక్టర్లను ఆదేశించారు. ఒక్క పేషెంట్ కూడా వైద్యం అందలేదన్న పరిస్థితి రావొద్దన్నారు. కావాల్సిన మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు..వెంటిలేటర్లు, ఆక్సిజన్ వంటి అన్ని సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. త్వరలోనే ఎంజీఎంకు ఫుల్ టైమ్ సూపరింటెండెంట్‌ను నియమిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
సమీక్షలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, ధనసరి అనసూయ, ఆరు జిల్లాల కలెక్టర్లు, డీఎంఅండ్ హెచ్వోలు, డీసీహెచ్ లు, ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్‌ఎం ఓలు, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.