గిరిజనులకు మంత్రి అల్లోల గుడ్‌న్యూస్.. అర్హులకు భూ హక్కులిస్తాం..!
దిశప్రతినిధి, ఆదిలాబాద్ : 2005 తర్వాత గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల వివరాలను వెంటనే అటవీ శాఖాధికారులు సబ్ కమిటీకి అందజేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నిర్మల్‌లోని దివ్య గార్డెన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ.. 2005 నుంచి గిరిజనుల సాగులోని పోడు భూములకు ఆర్వోఎఫ్ఆర్ పాసు పుస్తకాలు అందించామన్నారు. అర్హత గల ప్రతీ గిరిజనుడు సాగు […]
దిశప్రతినిధి, ఆదిలాబాద్ : 2005 తర్వాత గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల వివరాలను వెంటనే అటవీ శాఖాధికారులు సబ్ కమిటీకి అందజేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నిర్మల్‌లోని దివ్య గార్డెన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ.. 2005 నుంచి గిరిజనుల సాగులోని పోడు భూములకు ఆర్వోఎఫ్ఆర్ పాసు పుస్తకాలు అందించామన్నారు. అర్హత గల ప్రతీ గిరిజనుడు సాగు చేసుకుంటున్న భూమికి హక్కుపత్రాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే లక్ష్యంతో జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నాని తెలిపారు.
వ్యాక్సినేషన్ 100 శాతం విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. మండల స్థాయి సమావేశాల అజెండాలో వ్యాక్సినేషన్ అంశం చేర్చి 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ నిల్వలు జిల్లాలో తగినంత ఉన్నాయని.. ప్రత్యేక వ్యాక్సినేషన్ ద్వారా అందరికీ టీకాలు వేసి థర్డ్ వేవ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు, అవకతవకలు లేకుండా అప్పటికప్పుడే ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లలో ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే కలెక్టర్ దృష్టికి తేవాలన్నారు.
రైతులు పంట మార్పిడి విధానం అవలంభించాలని పప్పుదినుసులకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున శనగలు, నువ్వులు, కందులు, వేరుశనగ పంటల సాగుపై ఆసక్తి చూపాలన్నారు. ఎఫ్‌సీఐ దొడ్డు బియ్యం కొనుగోలు నిరాకరించినందున వేసవిలో దొడ్డు బియ్యం సాగు చేయాలన్నారు. సారంగాపూర్ మండలంలోని భూములు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నందున రైతులు ఆయిల్ ఫామ్ సాగును చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టరు ముషార్రఫ్ ఫారూఖీ, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, జి.విఠల్ రెడ్డి, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా, జడ్పీ చైర్పర్సన్ కె.విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఏఎంసీ చైర్పర్సన్ నర్మదా, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, పి.రాంబాబు, డీఎఫ్వో వికాస్ మీనా, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.