సరిహద్దులోనే వారికి అసలు సమస్య..!
దిశ, కరీంనగర్: ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు తంతు గమ్మత్తుగా సాగుతోన్నది. కేంద్ర ప్రభుత్వం వలస కూలీల తరలింపు ప్రక్రియకు లైన్ క్లియర్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొన్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వలస కూలీలను ఆయా జిల్లాల యంత్రాంగం చకచకా పంపిస్తోన్నది. అయితే వారంతా సరిహద్దుల్లోకి చేరగానే బ్రేకులు పడుతున్నాయి. కూలీలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్న అధికారులు తమ పని పూర్తయిందని సంతృప్తి చెందుతున్నారు. కానీ, అసలు సమస్య సరిహద్దుల్లో […]
దిశ, కరీంనగర్: ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు తంతు గమ్మత్తుగా సాగుతోన్నది. కేంద్ర ప్రభుత్వం వలస కూలీల తరలింపు ప్రక్రియకు లైన్ క్లియర్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొన్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వలస కూలీలను ఆయా జిల్లాల యంత్రాంగం చకచకా పంపిస్తోన్నది. అయితే వారంతా సరిహద్దుల్లోకి చేరగానే బ్రేకులు పడుతున్నాయి. కూలీలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్న అధికారులు తమ పని పూర్తయిందని సంతృప్తి చెందుతున్నారు. కానీ, అసలు సమస్య సరిహద్దుల్లో ఎదురవుతోంది. ఇక్కడి నుంచి వెళ్లే కూలీలను తమ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని పొరుగు రాష్ట్ర అధికారులు తేల్చి చెప్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతంలోని అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి తయారైంది.
తలలు పట్టుకుంటున్నారు..
శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు దాదాపు 2 వేల మంది కూలీలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరిహద్దులకు చేరుకున్నారు. వీరికి ఆయా జిల్లాల్లోని వీఆర్వోలే పాసులు జారీ చేసి పంపిస్తుండడం గమనార్హం. కొన్ని జిల్లాలకు సంబంధించిన కూలీలకు జిల్లా స్థాయి అధికారులు పాస్ లు జారీ చేసి పంపించారు. అయితే కాళేశ్వరానికి పొరుగునే ఉన్న మహారాష్ట్ర అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వలస కూలీలను తమ రాష్ట్రంలో అడుగు పెట్టనిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం చేరుకున్న కూలీలను పంపించడం ఎలా అని తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోన్నది. ఓ వైపు తెలంగాణ డీజీపీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి పాసులు జారీ చేస్తున్నారు. వీరు జారీ చేసే పాసులకు సంబంధించిన వారి వివరాలు కూడా ఆయా రాష్ట్రాల అధికారులకు పంపించనున్నారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య సమన్వయంతో కూలీలను స్వస్థలాలకు పంపే ప్రక్రియ సజావుగా సాగనుంది. కానీ, కొన్ని జిల్లాల్లో ఇష్టం వచ్చినట్టుగా పాస్ లు జారీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వారిదే బాధ్యత..
రాష్ట్రం దాటి వచ్చే వారికి వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్ కు పంపించడం వంటి చర్యలు తీసుకోవలసి ఉన్నందున ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకముందు ఎలా అనుమతి ఇస్తామని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అధికారులు చెప్తున్నారు. చివరకు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని రెవెన్యూ, పోలీస్ అధికారులు చొరవ తీసుకుని గడ్చిరోలి జిల్లా అధికారులతో మంతనాలు జరిపి కొంత మేరా సఫలం అయ్యారు. గడ్చిరోలి జిల్లా వాసులను మాత్రం తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఒప్పుకున్నారు. అయితే మహారాష్ట్రలోని ఇతర జిల్లాలకు చెందిన, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు మాత్రం సరిహద్దులు దాటి రాకుండా నిలువరించాల్సిన బాధ్యత తెలంగాణ అధికారులదేనని స్పష్టం చేశారు. దీంతో సరిహద్దుల్లోకి చేరుకున్న కూలీల్లో గడ్చిరోలి జిల్లా వారిని మాత్రమే పంపించి ఇతర ప్రాంతాలకు చెందిన వారిని తిప్పి పంపుతున్నారు. ఓ వైపున మహారాష్ట్ర అధికారులను ఒప్పించడం…మరో వైపున గడ్చిరోలి జిల్లా కూలీలను గుర్తించడం ఓ సమస్యగా తయారైతే… ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలను తిరిగి వారు జిల్లా నుంచి వచ్చారో అదే జిల్లాకు పంపించేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం తలనొప్పిగా తయారైంది.
చేతులు దులుపుకోవడంతో..
దీంతో శనివారం రాత్రి నుంచి కంటిమీద కునుకు లేకుండా కాళేశ్వరం బార్డర్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి తయారైంది. అయితే ఆయా రాష్ట్రాలు నోడల్ ఆఫీసర్లను నియమించుకుని సమన్వయంతో వలస కూలీలను స్వంత రాష్ట్రాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తెలంగాణలోని కొన్ని జిల్లాల అధికారులు నేరుగా పాస్ లు జారీ చేసి పంపిస్తున్నారు. వలస కూలీలకు పాస్ జారీ చేసి చేతులు దులుపు కుంటుండంతో సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తున్న వివిధ శాఖల అధికారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోన్నది.
tags: Check Post, Border, Officer, Maharashtra, Migrant Workers, Central Government, Directions