ఏ జట్టు బలమేంటి?

దిశ, స్పోర్ట్స్ :ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగు నెలల వ్యవధిలోనే మరోసారి క్రికెట్ అభిమానులను అలరించడానికి వచ్చేస్తున్నది. ప్రతిష్టాత్మక లీగ్‌లో చాంపియన్లు కావాలని అన్ని జట్లు మరోసారి రంగంలోకి దిగనున్నాయి. ఇప్పటి వరకు కప్ సాధించని జట్లుకు ఈ సీజన్ ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ సీజన్ వరకు మాత్రమే 8 జట్లు ఉంటాయి. వచ్చే సీజన్ నుంచి 10 జట్లు కానుండటంతో పోటీ మరింత తీవ్రంగా మారనున్నది. అందుకే ఈ సారే కప్ తమ […]

Update: 2021-04-03 08:24 GMT

దిశ, స్పోర్ట్స్ :ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగు నెలల వ్యవధిలోనే మరోసారి క్రికెట్ అభిమానులను అలరించడానికి వచ్చేస్తున్నది. ప్రతిష్టాత్మక లీగ్‌లో చాంపియన్లు కావాలని అన్ని జట్లు మరోసారి రంగంలోకి దిగనున్నాయి. ఇప్పటి వరకు కప్ సాధించని జట్లుకు ఈ సీజన్ ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ సీజన్ వరకు మాత్రమే 8 జట్లు ఉంటాయి. వచ్చే సీజన్ నుంచి 10 జట్లు కానుండటంతో పోటీ మరింత తీవ్రంగా మారనున్నది. అందుకే ఈ సారే కప్ తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 5 వేదికలకే పరిమితం అయిన సీజన్ 14లో తొలి విడత మ్యాచ్‌లు చెన్నై, ముంబయి వేదికలుగా జరుగనున్నాయి. చెన్నైలో ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. వాటిలో ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ జట్ల బలాలు, బలహీనతలు ఎంటో ఒక్కసారి చూద్దాం.

ముంబయి ఇండియన్స్..

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబయి ఇండియన్స్ పేరు తెచ్చుకున్నది. ఇప్పటి వరకు ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి.. 2019, 2020లో వరుసగా కప్పులు గెలిచింది. ఈ సారి కూడా విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నది. ముంబయి జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్నది. బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాకుండా జట్టులో ఆల్‌రౌండర్లు కూడా ఉండటం బాగా కలసి వస్తున్నది. రోహిత్ శర్మ, క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, ఇషాన్ కిషన్ ఈ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముక వంటి వాళ్లు. గత సీజన్‌లో రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా.. యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ బ్యాటింగ్ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. వీరిద్దరి గత సీజన్ ప్రదర్శనే టీమ్ ఇండియాలో చోటు సంపాదించిపెట్టింది. బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ కలసి గత ఏడాది 52 వికెట్లు తీయడం గమనార్హం. వీరికి తోడు నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, పీయుష్ చావ్లా కూడా వికెట్ తీయగల సత్తా ఉన్న వాళ్లే. మరోవైపు ఆల్‌రౌండర్ల విషయంలో అన్ని జట్ల కన్నా ముంబయి మెరుగైన స్థితిలో ఉన్నది. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, జేమ్స్ నీషమ్, అనుకూల్ రాయ్ వంటి ఆల్‌రౌండర్లు అటు బ్యాటుతోనే కాకుండా బంతితో కూడా సత్తా చాటగల వారే. ఇక ముంబయి ఇండియన్స్ రికార్డు చూస్తే… ప్రతీ సీజన్‌లో ఓటములతోనే లీగ్‌ను ప్రారంభిస్తున్నది. తొలి అర్దభాగంలో అపజయాల శాతం ఎక్కువగా ఉండటం ఇప్పటికీ పెద్ద సమస్యగా మారింది. అయితే పాయింట్ల పట్టికలో వెనుకబడినా చాలా సార్లు చివరి అంకంలో ముందంజ వేసి విజేతగా నిలిచింది. మరి ఈ సారి ఎలా లీగ్ ప్రారంభిస్తారో చూడాలి.

పూర్తి జట్టు :

రోహిత్ శర్మ, సౌరభ్ తివారి, క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, అనుమోల్‌ప్రీత్ సింగ్, కిరాన్ పొలార్డ్, పియుష్ చావ్లా, జేమ్స్ నీషమ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, అనుకూల్ రాయ్, అర్జున్ టెండుల్కర్, మార్కో జన్‌సేన్, ఆదిత్య ఠారే, క్వింటన్ డి కాక్, ఇషాన్ కిషన్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, నాథన్ కౌల్టర్-నైల్, ధవల్ కులకర్ణి, ట్రెంట్ బౌల్ట్, అడమ్ మిల్నే, జస్ప్రిత్ బుమ్రా, యుధ్‌వీర్ చరక్, మోషిన్ ఖాన్

కోచ్ : మహేల జయవర్దనే

తొలి మ్యాచ్ : ముంబయి Vs బెంగళూరు ఏప్రిల్ 9 రాత్రి 7.30

సన్‌రైజర్స్ హైదరాబాద్..

తొమ్మిదేళ్ల క్రితం ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ఒక్కసారి మాత్రమే చాంపియన్‌గా నిలిచింది. అయితే గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరడం సానుకూలాంశం. ఇందులో ఒక సారి విజేతగా నిలవగా మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్‌గా నిలకడైన ప్రదర్శనకు సన్‌రైజర్స్ మారుపేరు. అయితే ఈ జట్టులో అత్యధికంగా విదేశీ ఆటగాళ్లు ఉండటంతో జట్టు కూర్పు చాలా క్లిష్టంగా మారింది. టాప్ ఆర్డర్‌ ఆటగాళ్లైన కెప్టెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో పైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతున్నది. వారిద్దరి ఫామ్ పైనే సన్‌రైజర్స్ విజయావకాశాలు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇక కేన్ విలియమ్స్ ఎక్కువగా బెంచ్ పైనే ఉండాల్సి వస్తున్నది. సన్‌రైజర్స్ బలహీనత నాలుగో నెంబర్ బ్యాట్స్‌మాన్. ఈ స్థానంలో విజయ్ శంకర్ అనుకున్న మేరకు రాణించడం లేదు. అయితే ఈ సారి కేదార్ జాదవ్ జట్టులోకి రావడం శుభసూచకం. గత సీజన్‌లో చెన్నై తరపున పేలవ ప్రదర్శన చేసిన జాదవ్.. మరి ఈ సారి సన్‌రైజర్స్‌కు అండగా ఉంటాడా లేదా భారంగా మారతాడా అనేది అనుమానంగా ఉన్నది. ఈ జట్టులో ఆల్‌రౌండర్స్ కొరత అధికంగా ఉన్నది. విజయ్ శంకర్ బ్యాటు, బాల్‌తో సరిగా రాణించడం లేదు. జేసన్ హోల్డ్ మంచి ఆల్‌రౌండరే కానీ అతడిని జట్టులోకి తీసుకోవాలంటే కేన్ విలియమ్‌సన్ లేదా జానీ బెయిర్‌స్టోలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. మహ్మద్ నబీ గత సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. సన్‌రైజర్స్ ప్రధాన బలం బౌలింగ్. గత సీజన్‌లో గాయం కారణంగా భువనేశ్వర్ దూరమయ్యాడు. కానీ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న భువీ అందుబాటులోకి వచ్చాడు. అతడితో పాటు టి. నటరాజన్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్ జట్టుకు తప్పకుండా అదనపు బలమే. ఈ సారి కూడా సన్ రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉన్నది. అయితే ప్రతీసారి ప్లేఆఫ్స్‌లో వెనుదిరుగుతున్నారనే అపవాదును పోగొట్టుకోవలసి ఉన్నది. మరి ఈ సీజన్‌లో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.

పూర్తి జట్టు :

కేదార్ జాదవ్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, కేన్ విలియమ్‌సన్, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, విజయ్ శంకర్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, వృద్దిమాన్ సాహ, శ్రీవత్స్ గోస్వామి, జానీ బెయిర్‌స్టో, షాబాజ్ నదీమ్, జగదీష సుచిత్, రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, టి నటరాజన్, సందీప్ శర్మ, బాసిల్ థంపి, ఖలీల్ అహ్మద్

కోచ్ : ట్రెవర్ బేలిస్

తొలి మ్యాచ్ : సన్‌రైజర్స్ Vs కోల్‌కతా నైట్ రైడర్స్ ఏప్రిల్ 11 రాత్రి 7.30 గంటలు

Tags:    

Similar News