అవినీతి రుజువైనా చర్యలుండవా.. అధికారుల నిర్లక్ష్యానికి కారణమేంటి?
దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో దాదాపు 21 మహిళా సంఘాలకు చెందిన నగదు విషయంలో అవినీతి జరిగిందని మహిళా సంఘాల సభ్యులు గతంలో ఆందోళన చేశారు. దీనికి స్పందించిన అధికారులు మహిళా సంఘాల సమక్షంలో బహిరంగ విచారణలో ఏపీఎం, సీసీ, సీఏలు మూకుమ్మడిగా కుమ్మక్కై రూ.10 లక్షలను కాజేశారని నిరూపించారు. ఇది గడచి నేటికి పదిరోజులు దాటింది. అయినా సంబంధిత వ్యక్తులపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకి వెళితే.. నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లె […]
దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో దాదాపు 21 మహిళా సంఘాలకు చెందిన నగదు విషయంలో అవినీతి జరిగిందని మహిళా సంఘాల సభ్యులు గతంలో ఆందోళన చేశారు. దీనికి స్పందించిన అధికారులు మహిళా సంఘాల సమక్షంలో బహిరంగ విచారణలో ఏపీఎం, సీసీ, సీఏలు మూకుమ్మడిగా కుమ్మక్కై రూ.10 లక్షలను కాజేశారని నిరూపించారు. ఇది గడచి నేటికి పదిరోజులు దాటింది. అయినా సంబంధిత వ్యక్తులపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకి వెళితే.. నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన పూజ గ్రామైక్య సంఘంతో పాటు మరికొన్ని మహిళా సంఘాల డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ నల్లబెల్లిలోని మహిళా సంఘం భవన్‌ను బాధిత మహిళలు నవంబర్ 9న ముట్టడించారు. ఈ నేపథ్యంలో గొల్లపల్లె గ్రామంలో సుమారు 500 మంది మహిళా సభ్యుల సమక్షంలో జిల్లా డీఆర్‌డీఏ నుంచి ఏపీడీ శ్రీనివాస్, డీపీహెచ్ఐబీ దయాకర్, సీబీఓ ఆడిటర్ వెంకట్ పర్యవేక్షణలో నవంబర్ 12న బహిరంగ విచారణ చేపట్టారు. ఏపీఎం, సీసీ, సీఏలు కుమ్మక్కై రూ.10 లక్షలు అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలిందని అధికారులు గుర్తించారు. సీఏ మహిపాల్‌ని విధుల నుండి వెంటనే తప్పించారు. ఏపీఎం సునీత, సీసీ పద్మలపై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అధికారుల ఉదాసీనతపై అనుమానాలు
అధికారుల సమక్షంలో అవినీతి బయటపడి పదిరోజులు గడుస్తున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు వచ్చి నామమాత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం పాటు పడాల్సిన సిబ్బంది ఇలా అవినీతికి పాల్పడటం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ అవినీతి పరులపై చర్యలకు అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియట్లేదని బాధిత మహిళా సంఘం సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికైనా అవినీతి రుజువైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు వేడుకుంటున్నారు.