పరీక్షల్లో మాస్ కాపీయింగ్ దందా.. ఇది టీఆర్ఎస్ నాయకుడి పనేనా ?
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. విద్యార్థులతో పరీక్ష కేంద్రం నిర్వహకులు, సంబంధిత కాలేజీల యాజమాన్యాలు ఈ తంతును దగ్గరుండి చేపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ పట్ల అధికారుల తనిఖీలు కూడా కొరవడడంతో ఏమైనా చేసుకోవచ్చేనే ధీమాతో పరీక్ష రాయిస్తున్నారు. విద్యార్థులు ఏకంగా పుస్తకాలు, ఫోన్లలో చూసుకుంటూ పరీక్షలు రాస్తుండడం గమనార్హం. అంతేకాదు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. అధికారుల కన్నెత్తి […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. విద్యార్థులతో పరీక్ష కేంద్రం నిర్వహకులు, సంబంధిత కాలేజీల యాజమాన్యాలు ఈ తంతును దగ్గరుండి చేపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ పట్ల అధికారుల తనిఖీలు కూడా కొరవడడంతో ఏమైనా చేసుకోవచ్చేనే ధీమాతో పరీక్ష రాయిస్తున్నారు. విద్యార్థులు ఏకంగా పుస్తకాలు, ఫోన్లలో చూసుకుంటూ పరీక్షలు రాస్తుండడం గమనార్హం. అంతేకాదు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. అధికారుల కన్నెత్తి చూడకపోవడంతో, ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పుస్తకాలు, సెల్ఫోన్లతో..
కారేపల్లి మైనార్టీ స్కూల్లో ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థులు తమ ఇష్టారీతిన చూచిరాతలను తలపించేలా పరీక్షలు రాస్తున్నారు. గైడ్స్, పుస్తకాలు దగ్గర పెట్టుకుని మరీ కాలేజీల యాజమాన్యాలు ఈ తంతు నిర్వహిస్తున్నాయి. కేంద్రం నిర్వహకులతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని ఈ ఓపెన్ పరీక్షలు రాయిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆన్సర్లతో కూడిన సమాచారాన్ని సెల్ ఫోన్ల ద్వారా అందిస్తూ పరీక్షలు యథేచ్ఛగా రాయిస్తున్నారు. అయితే పరీక్ష కేంద్రానికి వెళ్లిన మీడియాను చూసి విద్యార్థులు పుస్తకాలను ప్యాడ్ల కింద పెట్టుకోవడం గమనార్హం.
ఒకరికి బదులు మరొకరు..
మాస్ కాపీకీ పాల్పడడమే కాకుండా ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది డీ గ్రేడ్ ఉద్యోగులు తమ ప్రమోషన్ల కోసం ఓపెన్ డిగ్రీ ద్వారా సర్టిఫికేట్ పొంది పదోన్నతి పొందుతుంటారు. ఇలాంటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పరీక్ష రాయలేని వారు.. తమకు బదులుగా వేరేవారితో పరీక్ష రాయించేలా ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.
భారీగా డబ్బు వసూళ్లు..
ఓపెన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ దందా నడిపించేందుకు విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పేపర్ కు కొంత డబ్బు తీసుకుని వారికి కావాల్సిన గైడ్స్, బుక్స్ సమకూర్చడం. అవసరం అయితే సెల్ ఫోన్లు అందించి వారికి సహకరించడం చేస్తున్నారని ఆ సెంటర్లోని ఓ సిబ్బంది చెబుతున్న మాట. ఇలా విద్యార్థుల నుంచి వేలల్లోనే డబ్బు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఒకరికి బదులు వేరొకరు పరీక్ష రాస్తే అవసరాన్ని బట్టి భారీగానే డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఓపెన్ పరీక్షలు కొంతమంది అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది.
అధికారులకూ ముడుపులు..
కారేపల్లి మైనార్టీ స్కూల్లో ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. ముందుగానే ఒప్పదం చేసుకుని ఆవైపుగా స్క్వాడ్ రాకుండా కొంతమంది పెద్దలు వారికి సైతం భారీగానే ముడుపులు అందజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ ఇలాంటి పరీక్షలపై కొంతమంది విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి చదువుకుని పరీక్ష రాస్తే కొందరేమో చూసి రాస్తున్నారని.. దీనివల్ల వారికే ఎక్కువ మార్కులు వచ్చిన తమ ప్రతిభకు గుర్తింపు ఉండడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ తతంగంపై ఉన్నతాధికారులు దృష్టిసారించి నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దగ్గరుండి నడిపిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు..
ఈ మాస్ కాపీయింగ్ అంతా కారేపల్లి మండలం టీఆర్ఎస్ నాయకుడు మల్లెల నాగేశ్వరరావు నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయన గతంలో ఎస్ఆర్ఆర్ కాలేజీకి ప్రిన్స్ పాల్ గా ఉన్నారు. అయితే కొంత కాలం క్రితం ఆ కాలేజీ మూతపడడంతో అదే భవనంలో ఇప్పుడు ఓపెన్ డిగ్రీ పరీక్షల కోసం సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతమైతే మాస్ కాపీయింగ్ కు అనుకూలంగా ఉంటుందని భావించిన సదరు నాయకుడు అధికారులను కూడా మేనేజ్ చేసినట్లు సమాచారం. డిగ్రీ పట్టా అవసరం ఉన్న ఉద్యోగులతో ఓపెన్ పరీక్షలు రాయించి, వారి దగ్గర భారీగా ముడుపులు తీసుకుంటుంటారని పలువురు చెప్పడం గమనార్హం. అంతేకాదు.. ఈయన కారేపల్లి సంతగుడికి ఎండోమెంట్ చైర్మన్ గా ఉన్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరుడిగా కూడా మల్లెల నాగేశ్వరరావుకు పేరుంది.