రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ప్రపంచంలోనే ఒక విలక్షణమైన దేశభక్త సంస్థ. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ సంస్థ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, వివక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థను అభిమానించే వారికీ, ఆ సంస్థను ద్వేషించే వారికి, దూషించే వారికి వ్యక్తిగతంగా ఇదే అభిప్రాయం ఉంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఆరెస్సెస్ అధినేత (సర్ సంఘ్ చాలక్) మోహన్ జీ భగవత్ భారతదేశ రాజకీయ నాయకుల ప్రవర్తన తీరుపై, ఈ దేశం పట్ల వారికి ఉండవలసిన నిబద్ధతపై, అధికార పక్షం, ప్రతిపక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణిపై ఆరెస్సెస్ పత్రికలైన పాంచజన్య, ఆర్గనైజర్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని విషయాలను కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు తప్పుగా అర్థం చేసుకొని, మోడీని, ఆయన భజనపరులను దృష్టిలో పెట్టుకొని, ఈ మాటలు ఆయన అన్నారని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో చర్చించడం కొందరికి వినోదప్రాయంగా ఉంది.
ప్రధాని మోడీని తిట్టడానికి అవకాశాలను వెతుక్కుంటున్న కాంగ్రెస్ నాయకులు జయరాం రమేష్ లాంటివారు ఆరెస్సెస్ అధినేత చెప్పిన హితబోధలైనా వినండి అని ప్రధాని మోడీని కోరడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌ను, 'ఇస్లామిక్ బ్రదర్‌హుడ్', 'సిమీ'లతో పోల్చి, దేశ ప్రజల దృష్టిలో పలుచనైపోయిన విషయం జయరాం రమేష్‌కి తెలియదేమో! కాశ్మీర్ విలీనీకరణ సమయంలో, పాకిస్తాన్‌తో చేసిన మూడు యుద్ధాల్లో, 1962 చైనా దాడి సమయాల్లో సైన్యానికి ఆరెస్సెస్ కార్యకర్తలు అందించిన సహకారాన్ని కాంగ్రెస్ నాయకులు ఏనాడూ గుర్తుచేసుకోరు. ప్రతిపక్షాల నుండి పోటీ లేకుండా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ఏ విధంగా దూషించింది ఈ దేశ ప్రజలందరికీ తెలుసు.
ఆరెస్సెస్ అధినేత చెప్పిందేమిటి?
రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యర్థులే గాని విరోధులు ఏమాత్రం కాదు. అధికారపక్షం, ప్రతిపక్షం సైద్ధాంతిక వైవిధ్యంతో ఉన్నప్పటికీ దేశ ప్రజలకు మేలు చేసే విషయంలో సంయమనంతో వ్యవహరించాలి. అధికారపక్షం ఎప్పుడు కూడా ప్రతిపక్షం నాశనం కావాలని కోరుకోకూడదు. అదేవిధంగా ప్రతిపక్షం దేశ అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉండాలి. అధికార, ప్రతిపక్ష నాయకుల విమర్శలు హుందాతనంతో ఉండాలి. వ్యక్తిగత దూషణలకు, వైషమ్యాలకు తావు ఇచ్చి ప్రజలలో చులకనైపోకూడదు. ఈ హితబోధనలన్నీ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వర్తిస్తాయి. ఇక ఈ హితబోధనలు మోడీని దృష్టిలో ఉంచుకుని చేసినవని కాంగ్రెస్ నాయకులు ఎలా బుకాయిస్తారు? ఇక మణిపూర్ రాష్ట్రంలో చెలరేగుతున్న మారణకాండ గురించి, తీవ్రవాద చర్యల అడ్డుకట్ట గురించి, కుకీ, మైత్రేయి తెగల మధ్య నెలకొన్న వైషమ్యాలను రూపుమాపడం గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను సానుకూలంగా అర్థం చేసుకోవాలి. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ పాలనా విధానం వల్లనే ఆ రాష్ట్రం మంటలతో తగలబడి పోతోందనే అభిప్రాయం ఆయన మాటల్లో లేదు. మణిపూర్లో మారణకాండ చల్లారకుండా ఉండడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కారణమని ఆయన మాటల్లోని అంతరార్థం!
నేతల అసంబద్ధ వ్యాఖ్యలపై చురకలు
ఎన్నికల ప్రచార సందర్భంలో బీజేపీ నాయకులూ, ఇండియా కూటమి నాయకులూ చేసిన అసంబద్ధ వ్యాఖ్యల ద్వారా దేశ ప్రజలను అపోహలకు, అనుమానాలకు అనవసర భయాలకు గురిచేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హిత వచనాలు ఆయన పలికినట్లు అర్థం చేసుకోవాలి. ఈ దేశంలోని ప్రజలందరికీ ఒకటే డీఎన్ఏ అని, ఈ దేశంలో ప్రజలందరూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, అతీతంగా ముందుకెళ్ళినప్పుడే దేశ ప్రగతికి అవరోధాలు తగ్గుతాయని గతంలో ఆయన చెప్పిన మాటలకు ఇది కొనసాగింపే! ఢిల్లీలోని ముస్లిం మత పెద్దలతో కలిసి ఒక మదర్సాకు వెళ్లడం, అక్కడ విద్యార్థులతో దేశభక్తి విషయాలు ముచ్చటించడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని, ఈ దేశ రాజకీయ నాయకుల నుండి ఈ దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఆయన ఆలోచన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బీజేపీ నాయకత్వానికి ప్రధానంగా నరేంద్రమోడీకి ఆరెస్సెస్ అధినేత గడ్డిపెట్టారని వ్యాఖ్యానించడం 'స్వకుచమర్దన'లో భాగమే అవుతుంది.
ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు,
94417 37877