లొంగు 'బాట' దిశగా మావోయిస్టు అగ్రనేతలు..!

దిశ, న్యూస్ బ్యూరో: మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితోపాటు మరో నలుగురు మావోయిస్టు నేతలు త్వరలో ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ ముం దు రెండు మూడు రోజుల్లోనే సరెండర్ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. గణపతితోపాటు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కటకం సుదర్శన్ అలి యాస్ ఆనంద్‌, గణపతి భార్య సుజాత, భూపతి భార్య తారాబాయి కూడా లొంగిపోనున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల […]

Update: 2020-09-01 21:53 GMT

దిశ, న్యూస్ బ్యూరో:

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితోపాటు మరో నలుగురు మావోయిస్టు నేతలు త్వరలో ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ ముం దు రెండు మూడు రోజుల్లోనే సరెండర్ అయ్యే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. గణపతితోపాటు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కటకం సుదర్శన్ అలి యాస్ ఆనంద్‌, గణపతి భార్య సుజాత, భూపతి భార్య తారాబాయి కూడా లొంగిపోనున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ దాదాపు కొలిక్కి వచ్చిందని, ఇక లాంఛనంగా లొంగిపోయినట్లు ప్రకటన వెలువడడమే తరువాయి అని తెలుస్తోంది.

గత మూడు నెలలుగా వీరంతా ఇంటెలిజెన్స్ బ్యూరోతో టచ్ లో ఉన్నారని, నాగపూర్ నుంచి మొదలైన లొంగుబాటు చర్చలు, రాయపూర్ దగ్గర ఫైనల్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల అదుపులో ఉన్న వీరంతా ఒకేసారి కేంద్ర హోం మంత్రి ముందు లొంగిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనాతో, అనారోగ్యంతో చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అమిత్ షా ఆరోగ్యం సహకరించకపోతే, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముందు లొంగిపోవచ్చని సమాచారం. ముగ్గురూ అగ్రనేతలే కావడం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ‘మోస్ట్ వాంటెడ్ లిస్టు’లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ముందే లొంగి పోవాలనుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన దాఖలాలు లేవు. కేంద్ర హోంశాఖ ముందు లొంగిపోతే ఇదే తొలి సరెండర్ అవుతుంది.

తెలంగాణ ద్వారా చర్చలు..

గణపతి లొంగుబాటు ప్రక్రియ తెలంగాణ నుంచే ప్రారంభమైనట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన సామాజికవర్గ నేతలు, గణపతి బంధువుల ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఈ ప్రక్రియలో కీలక భూమిక పోషించిన నేత పేరు మాత్రం బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా ఈ ప్రక్రియ సాగినా నాలుగైదు నెలల క్రితమే ఆశించిన ఫలితాలు రాబోతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి.
అనుకున్నట్లుగానే గణపతి ద్వారా ఆయనకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరు కూడా లొంగిపోడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఐబీ వర్గాలకు సమాచారం అందింది. ఈ విషయం తెలంగాణ పోలీసులకు తెలియందేమీ కాకపోయినప్పటికీ, బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లొంగుబాటు అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పరోక్షంగా, ఆయనతోపాటు మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోతే ఆహ్వానిస్తామంటూ లీకులు ఇచ్చారు. దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల సరెండర్‌కు తెలంగాణ ద్వారానే ప్రక్రియ మొదలైందని తెలిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నభయం కారణంగానే గోప్యంగా ఉంచినట్లు తెలిసింది.

ముందస్తు షరతులు?

లొంగుబాటు చర్చల సందర్భంగా గణపతి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 150 కేసులు ఉన్నందున వాటన్నింటినీ బేషరతులుగా ఎత్తివేయాలన్నది తొలి డిమాండ్. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రశాంత జీవితం గడిపే వాతావరణ ఉండాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడులు ఉండకూడదనేది రెండో డిమాండ్. జీవనాధారానికి సంబంధించిన ఆర్థిక సాయం లేదా ఉపాధి అవకాశాలను కల్పించాలన్న డిమాండ్‌ను కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ ముగ్గురిపైనా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల మేర రివార్డులు ప్రకటించాయి. లొంగుబాటుతో వీటిని తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ముగ్గురూ సమకాలికులే..

గణపతితో పాటు లొంగిపోయే అవకాశాలున్నాయంటూ ఐబీ వర్గాలు పేర్కొన్న మావోయిస్టు నేతలంతా దాదాపు సమకాలికులు. ఎమర్జెన్సీ సమయంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలోకి ఆకర్షితులయ్యారు. తొలుత గణపతి, ఆ తర్వాత ఆనంద్, మరికొంతకాలానికి వేణుగోపాల్ పార్టీలో చేరారు. అప్పటి నుంచీ వివిధ స్థాయిల్లో, వేర్వేరు బాధ్యతల్లో పార్టీలో కొనసాగిన వీరంతా సత్సంబంధాల్లోనే ఉన్నారు. ముగ్గురూ తెలంగాణకు చెందినవారే. 2018 నవంబరులో నాయకత్వ మార్పు తదనంతర పరిస్థితుల్లో వీరి ముగ్గురి అభిప్రాయాలూ దాదాపు ఒక్కటిగానే ఉన్నాయని, అందువల్లనే గణపతి ద్వారా ఆ ఇద్దరినీ కూడా సరెండర్ చేయించడానికి మార్గం సుగమమైనట్లు తెలిసింది.

తెలంగాణ టార్గెట్‌గా మారకుండా..

నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కామెంట్ చేశారు. నక్సలైట్ల కదలికలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పలు సందర్భాల్లో కేంద్ర హోం శాఖకు స్పష్టం చేశారు. ఇప్పుడు గణపతి లొంగుబాటుకు చొరవ తీసుకున్నది తెలంగాణ నేతలే అయినా, అది ఎక్కడా బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. గణపతి లొంగుబాటుకు చూపిన చొరవతో మావోయిస్టు పార్టీకి టార్గెట్‌గా మారుతామన్న భయం కూడా లేకపోలేదు. క్రెడిట్ దక్కకున్నా ఫర్వాలేదుగానీ టార్గెట్‌గా మారకూడదన్నది ప్రధాన ఉద్దేశం.

అనారోగ్యమా? సైద్ధాంతిక విభేదాలా?

సరిగ్గా రెండేళ్ళ క్రితం, 2018 నవంబరులో, మావోయిస్టు పార్టీ నాయకత్వంలో భారీ మార్పులు జరిగాయి. సుమారు రెండున్నర దశాబ్దం పాటు పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గణపతిని ఆ బాధ్యతల నుంచి అనారోగ్యం కారణాలతో తప్పించిన పార్టీ నాయకత్వం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వరంగల్ ఆర్‌ఈసీ విద్యార్థి నంబళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్నకు బాధ్యతలు అప్పజెప్పింది. కేవలం అనారోగ్య కారణంతో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించినట్లా? లేక సైద్ధాంతిక విభేదాలు కూడా కారణమా అనే చర్చ చాలా కాలంగా సమాజంలో జరుగుతూ ఉంది. 1983-84లో పీపుల్స్ వార్ పార్టీలో తొలిసారిగా సైద్ధాంతిక విభేదాలు వచ్చి ‘దిద్దుబాటు క్యాంపెయిన్’తో సమసిపోయాయి. అప్పట్లో పార్టీకి కొండపల్లి సీతారామయ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 1991-94 కాలంలో రెండో సైద్ధాంతిక విభేదాలు పొడసూపాయి.

కొండపల్లి సీతారామయ్యను పార్టీ నుంచి బహిష్కరించి గణపతి కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పలు కేంద్ర కమిటీ సమావేశాల్లో, పోలిట్‌బ్యూరో సమావేశాల్లో ఇలాంటి విభేదాలు వచ్చాయి. పార్టీలో నిరంతరం ఏదో ఒక అంశంపైన నాయకత్వంలో వివిధ స్థాయిల్లో ఇలాంటి విభేదాలు రావడం, చర్చల ద్వారా పరిష్కరించడం ఎప్పుడూ జరిగే ప్రక్రియే. గణపతి స్థానంలో కేవశరావును నియమించడం వెనక ఇలాంటి సైద్ధాంతిక విభేదాలే కీలక భూమిక పోషించాయనేది పలు సందర్భాల్లో స్పష్టమైంది. పార్టీని విస్తరించడం, మిలిటెంట్ యాక్షన్‌ల ద్వారా రిక్రూట్‌మెంట్‌ను పెంపొందించుకోవడం, పట్టణ ప్రాంతాల్లో ఫ్రంటల్ ఆర్గనేషన్స్ ద్వారా నిలిచిపోయిన కార్యకలాపాలను మళ్ళీ పునరుద్ధరించడం, విద్యార్థి సెక్షన్‌లో క్రియాశీలం కావడం.. ఇలాంటి అనేక అంశాల్లు కీలక సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చేవి. ఆ నేపథ్యంలో గణపతికి బదులుగా దూకుడుగా వ్యవహరించే బసవరాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పే నిర్ణయం జరిగింది.

పార్టీకి తెలుసా?

వీరి సరెండర్ గురించి పత్రికల్లో వార్తలు వస్తున్నా పార్టీ నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. గత కొంతకాలంగా సంబంధాలు తెంచుకున్నట్లు పార్టీకి తెలుసు అని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ లొంగుబాటు గురించి తెలిసిన తర్వాత ప్రకటన రావచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన ఎలాగూ వస్తుందని, లొంగుబాటుకు ముందే అలాంటి ప్రకటనను ఊహించలేమని ఉదహరించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మావోయిస్టు అగ్రనేతల సరెండర్‌ను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గణనీయ స్థాయిలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గిపోయాయి. బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఉన్నప్పటికీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లొంగుబాటును బీజేపీ ఘన విజయంగా చెప్పుకుని ఓటు బ్యాంకు అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News