Akasa Air: ఇద్దరు ఆకాసా ఎయిర్ ట్రెయినింగ్ డైరెక్టర్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ
శుక్రవారం ఇద్దరు సీనియర్ ఆకాసా ఎయిర్ ఎగ్జిక్యూటివ్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఇద్దరు సీనియర్ ఆకాసా ఎయిర్ ఎగ్జిక్యూటివ్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ నిరాజ్ భాటియాతో పాటు డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఫ్లాయిడ్ గ్రేషియస్‌లను పైలట్ శిక్షణా లోపాల కారణంగా వారిద్దరినీ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 7న నిర్వహించిన ఆడిట్‌లో పైలట్లకు నావిగేషన్‌కు సంబంధించి ఆర్ఎన్‌పీ శిక్షణలో నాణ్యతలేని సిమ్యూలేటర్(పరికరం) వాడినట్టు గుర్తించామని డీజీసీఏ స్పష్టం చేసింది. ఆర్ఎన్‌పీ ట్రెయినింగ్ అనేది పైలట్లకు నావిగేషన్ ద్వారా విమానాలను నడపడంలో ఉపయోగపడే శిక్షణ. అయితే, ఈ శిక్షణ విషయంలో సిబ్బందికి నిరాజ్ భాటియా, ఫ్లాయిడ్ గ్రేషియస్‌లు విఫలమయ్యారు. అంతేకాకుండా వారిద్దరి శిక్షణలో పదేపదే లోపాలు, ఉల్లంఘనలు ఉన్నట్టు డీజీసీఏ గుర్తించింది. ఈ కారణంగానే ఇద్దరు అధికారులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. దీనిపై స్పందించిన ఆకాసా ఎయిర్ ప్రతినిధి.. డీజీసీఏ ఆర్డర్‌ను అందుకున్నామని, ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. ఏవియేషన్‌లో భద్రత చాలా ముఖ్యం. అందుకు సంస్థ కట్టుబడి ఉంది. మెరుగైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.