Exports: 2025లో భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు
అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి అవకాశాలను భారత్ అందిపుచ్చుకోగలదని నిపుణులు చెబుతున్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఎగుమతులు భవిష్యత్తులో మరింత వేగంగా పెరగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అధిక విలువైన మెషినరీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి అవకాశాలను భారత్ అందిపుచ్చుకోగలదని వారు చెబుతున్నారు. ప్రపంచ అనిశ్చితి, ఇతర సంఘర్షణలు ఉన్నప్పటికీ 2025లో దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే నెలలో అమెరికాలో కొత్త ప్రభుత్వం చైనా, మెక్సికో, కెనడాలపై అధిక సుంకాలను విధిస్తే, ఆ అవకాశాలను భారతీయ ఎగుమతిదారులు అందిపుచ్చుకుని ప్రయోజనవం పొందవచ్చు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎర్ర సముద్ర సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చు. తద్వారా రవాణాలో ఉన్న ఇక్కట్లు తొలగుతాయి. ప్రపంచ సరఫరా మెరుగుపడి, వ్యాపారులకు షిప్పింగ్ ఖర్చులు తగ్గుతాయి. ఇదే సమయంలో అదనపు సుంకాలు ఎగుమతిదారులపై ప్రభావం చూపుతున్నాయి. భారతీయ వస్తువులపై మన ప్రభుత్వం తరహాలోనే సుంకాలు విధిస్తానట్టు ట్రంప్ ధోరణి ఎగుమతి రంగంపై ఒత్తిడి కలిగించవచ్చు. మరోవైపు యూరోపియన్ యూనియన్ గ్రీన్ రెగ్యులేషన్స్, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం), అటవీ నిర్మూలన చట్టాలు కూడా ఎగుమతి ఖర్చులను పెంపు, స్వేచ్ఛా వాణిజ్య చర్చలను క్లిష్టతరం చేయనున్నాయి. అంతర్జాతీయంగా వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ అధిక విలువైన రంగాల మద్దతుతో భారత్ ఎగుమతుల రంగంలో తన సత్తాను చాటుందని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.