ఒలింపిక్స్ వెనుక విషాధ గాధ.. బలవుతున్న పేదలు
దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్ వస్తున్నాయంటే క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులకు పండగ వాతావరణమే. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడల కోసం ఎన్నో ఏళ్ల నుంచి సాధన చేస్తుంటారు. అలాగే ఈ మెగా క్రీడలను నిర్వహించే నగరాలు బిడ్డింగ్ ప్రక్రియను 15 ఏళ్లకు ముందే ప్రారంభిస్తుంది. ఒకసారి బిడ్ గెలిచిన తర్వాత కనీసం 5 ఏళ్ల ముందు నుంచే స్టేడియంలు, క్రీడాగ్రామాల నిర్మాణం ప్రారంభిస్తారు. టోక్యో ఒలింపిక్స్ కోసం కూడా భారీ నిర్మాణాలను కొన్నేళ్ల క్రితమే ప్రారంభించారు. […]
దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్ వస్తున్నాయంటే క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులకు పండగ వాతావరణమే. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే విశ్వ క్రీడల కోసం ఎన్నో ఏళ్ల నుంచి సాధన చేస్తుంటారు. అలాగే ఈ మెగా క్రీడలను నిర్వహించే నగరాలు బిడ్డింగ్ ప్రక్రియను 15 ఏళ్లకు ముందే ప్రారంభిస్తుంది. ఒకసారి బిడ్ గెలిచిన తర్వాత కనీసం 5 ఏళ్ల ముందు నుంచే స్టేడియంలు, క్రీడాగ్రామాల నిర్మాణం ప్రారంభిస్తారు. టోక్యో ఒలింపిక్స్ కోసం కూడా భారీ నిర్మాణాలను కొన్నేళ్ల క్రితమే ప్రారంభించారు. ఇందు కోసం అప్పటికే టోక్యోలో ఉంటున్న కొంత మంది ఇళ్లను ఖాళీ చేయించారు. చెట్లను నరికేయడం, నదులను పూడ్చేయడం వంటి ప్రక్రియ కూడా కొనసాగింది. ప్రపంచంలో ఎక్కవైనా భారీ ప్రాజెక్టు వస్తే పేదలు, మధ్య తరగతి వాళ్లు బలికావడం సాధారణ విషయమైపోయింది. అలాగే టోక్యో ఒలింపిక్స్ కారణంగా వందలాది మంది సొంత ఇళ్లను, ప్రదేశాలను వదిలేసుకొని వెళ్లిపోవాల్సి వచ్చింది. వారిలో కోహీ జిన్నో అనే వ్యక్తిది మాత్రం చాలా బాధాకరమైన కథ. ఎందుకంటే 2020 ఒలంపిక్స్ కోసమే కాదు అంతకు ముందు 1964లో జరిగిన ఒలింపిక్స్ కోసం కూడా జిన్నో తన సొంత ఇంటిని కోల్పోయాడు.
తొలి సారి ఇలా..
టోక్యోలో నివసించే కోహీ జిన్నో మొదట్లో సెంట్రల్ టోక్యో ప్రాంతంలో నివిసించే వాడు. అంతకు ముందు తన తల్లిదండ్రులతో కలసి దానికి కొద్ది దూరంలోనే ఉన్న పాత ఇంటిలో ఉండేవాడు. కానీ రెండో ప్రపంచ యుద్ద సమయంలో ఆ ఇల్లు కాలిపోవడంతో సెంట్రల్ టోక్యోకు వచ్చాడు. 1957 నుంచి సెంట్రల్ టోక్యోలోనే జిన్నో కుటుంబంతో కలసి ఉన్నాడు. అయితే 1964లో టోక్యోలో మొదటి సారి ఒలింపిక్స్ నిర్వహించారు. అప్పుడు జిన్నో తన కుటుంబంతో ఉంటున్న ఇంటిని జపాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అప్పటి వరకు ఆ ఇంటికి ఆనుకొనే ఒక సిగరెట్ల షాపు నడిపే జిన్నో.. ప్రభుత్వం ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో కుటుంబంతో సహా కట్టు బట్టలతో వెళ్లిపోయాడు. జిన్నో వదిలేసుకున్న ఇంటి చుట్టు పక్కల ప్రాంతాన్ని జపాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ ప్రధాన స్టేడియాన్ని నిర్మించింది. చుట్టూ పచ్చగా ఉన్న చెట్లను కూడా అప్పుడు నరికేశారు. నిరాశ్రయుడైన జిన్నో కొన్నాళ్ల పాటు కార్లు కడిగి కుటుంబాన్ని పోషించాడు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్మించిన కసుమిగవోక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోకి మారాడు. ఆ తర్వాత అదే కాంప్లెక్స్ సమీపంలో పొగాకు అమ్మే దుకాణాన్ని తెరిచాడు.
ఇప్పుడు మళ్లీ..
జిన్నో కుటుంబం మరోసారి ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నది. వాళ్లు నివసిస్తున్న కసుమిగవోక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ 2020 ఒలింపిక్స్ కోసం కావాలంటూ 2013 సెప్టెంబర్ 13న నోటీసులు అందాయి. అప్పటికే ఒకసారి సొంత ఇంటిని వదిలేసుకొని వచ్చిన ఆ కుటుంబం మరోసారి ఇంటిని కోల్పోసి రావడంతో చాలా బాధపడ్డారు. జిన్నో భార్య యసుకో ఈ నోటీసులు అందిన తర్వాత తీవ్ర మనోవేదనతో కన్నుమూసింది. ఆ తర్వాత జిన్నో ఆ ఇంటిని వదిలి తన కుమారుడు నివసిస్తున్న మరో ప్రదేశానికి వెళ్లిపోయాడు. 2018లో ఇంటి నుంచి బయటకు వచ్చిన జిన్నో.. అప్పుడప్పుడు వెళ్లి కూల్చి వేసిన ఇంటి ప్రదేశాన్ని చూసుకొని వచ్చేవాడు. ఇప్పుటు ఒలింపిక్స్ కోసం నిర్మించిన సెంట్రల్ స్టేడియం, దాని పక్కన పార్కు కింద శిథిలమైపోయిన తన ఇంటిని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాడు. ప్రతీ రోజు సెంట్రల్ స్టేడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో తన బాధను పలువురికి చెబుతున్నాడు. మరోసారి జపాన్‌లో ఒలింపిక్స్ నిర్వహించవద్దని వేడుకుంటున్నాడు. తనలాగా మరొకరు బాధ పడకూడదని అతడు పడుతున్న ఆవేదనను ‘రాయిటర్స్’ సంస్థ వెలుగులోకి తీసుకొని వచ్చింది. ఒలింపిక్స్ వెనుక ఉన్న విషాద గాధలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఒలింపిక్స్ కోసం ఎంతో మంది తమ గూడును కోల్పోయిన విషయాన్ని తెలిపింది.