పరిహారం కోసం పడిగాపులు.. అందుబాటులో లేని కలెక్టర్
దిశ ప్రతినిధి, మెదక్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ….. ఈ పేరు వింటే భూ నిర్వాసితుల గుండెల్లో హడల్ పుడుతుంది. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని, తమ భవిష్యత్‌ను చక్కదిద్దేందుకు హైకోర్టు సూచించిన మాదిరిగా తమకు ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని పలుమార్లు అధికారులను కలిసినా.. ప్రజాప్రతినిధులను వేడుకున్నా… దీక్షా శిబిరాలు నిర్వహించినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. కొంతమంది భూబాధితులు హైకోర్టును ఆశ్రయించారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం సిద్దిపేట కలెక్టర్ […]
దిశ ప్రతినిధి, మెదక్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ….. ఈ పేరు వింటే భూ నిర్వాసితుల గుండెల్లో హడల్ పుడుతుంది. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని, తమ భవిష్యత్‌ను చక్కదిద్దేందుకు హైకోర్టు సూచించిన మాదిరిగా తమకు ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని పలుమార్లు అధికారులను కలిసినా.. ప్రజాప్రతినిధులను వేడుకున్నా… దీక్షా శిబిరాలు నిర్వహించినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. కొంతమంది భూబాధితులు హైకోర్టును ఆశ్రయించారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయానికి రావాలన్న అధికారుల పిలుపు మేరకు సుమారు తొమ్మిది గ్రామాల భూ నిర్వాసితులు కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్నారు. తీరా సమయానికి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
పరిహారం కోసం పడిగాపులు
మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలోని ఒంటరి మహిళలకు, వృద్ధులకు పూర్తిస్థాయి ప్యాకేజీ ఇవ్వాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలోని ఒంటరి మహిళలకు, వృద్దులకు ప్యాకేజీ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది బాధితులు గతంలో తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించడంతో సోమవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంకు రావాలని అధికారులు పిలుపు మేరకు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంకు బాధితులు చేరుకున్నారు. ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోనికి అనుమతి ఇస్తున్నారు.
పూర్తి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న సుమారు తొమ్మిది గ్రామాల ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు నిర్వాసితుల మాదిరిగా తనుకు సైతం పూర్తి స్థాయి ప్యాకేజీ
ఇవ్వాలని పలువురు భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఒకరికి ఒక న్యాయం … మరొకరి ఇంకో న్యాయమా అంటూ పలువురు వృద్దులు మీడియాతో ఆవేదన వెలిబుచ్చారు. మా ఓట్లతో గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే దీనిపై స్పందించాలంటూ కొందరు నినదించారు. తమకు కూడా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.