72 ఏళ్ల మలేషియన్ బాడీ బిల్డర్

దిశ, ఫీచర్స్ : మైండ్ ఫిట్‌నెస్ కోసం ‘ధ్యానం, సంగీతం, పజిల్స్, గేమ్స్, యోగా’ వంటివి చేస్తుంటాం. ఇక బాడీ ఫిట్‌నెస్ కోసం రోజుకో 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అందరూ చెప్పే మాటే. ఈ క్రమంలో కొవిడ్ తర్వాత చాలామందిలో ఆరోగ్య స్పృహ పెరగడంతో ‘ఎక్సర్‌సైజ్’ను తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. కానీ 72 ఏళ్ల బాడీబిల్డర్ అరోకియాసామి మాత్రం దశాబ్దాల నుంచి ‘జిమ్’ చేస్తూ కరోనాకే సవాల్ విసురుతున్నాడు. తన దేహదారుఢ్యంతో ఎన్నో […]

Update: 2021-03-31 08:28 GMT

దిశ, ఫీచర్స్ : మైండ్ ఫిట్‌నెస్ కోసం ‘ధ్యానం, సంగీతం, పజిల్స్, గేమ్స్, యోగా’ వంటివి చేస్తుంటాం. ఇక బాడీ ఫిట్‌నెస్ కోసం రోజుకో 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అందరూ చెప్పే మాటే. ఈ క్రమంలో కొవిడ్ తర్వాత చాలామందిలో ఆరోగ్య స్పృహ పెరగడంతో ‘ఎక్సర్‌సైజ్’ను తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. కానీ 72 ఏళ్ల బాడీబిల్డర్ అరోకియాసామి మాత్రం దశాబ్దాల నుంచి ‘జిమ్’ చేస్తూ కరోనాకే సవాల్ విసురుతున్నాడు. తన దేహదారుఢ్యంతో ఎన్నో పతకాలు కొల్లగొట్టిన ఆ మిస్టర్ బాడీబిల్డర్ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి.

ఏడు పదుల వయసులోనూ జిమ్‌లో కిలోలకొద్దీ బరువులు ఎత్తుతూ కసరత్తులు చేస్తున్నాడు అరోకియా. కరోనా లాంటి మహమ్మారులనే కాదు, వృద్ధాప్యాన్ని కూడా వ్యాయామం దూరం చేస్తుందని అతడు బలంగా నమ్ముతాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల అరోకియాసామి తన 11 ఏళ్ల వయసులో చదువు మానేసి పనిలో చేరాడు. హాలీవుడ్ హీరో, బాడీ బిల్డర్ అర్నాల్డ్‌ను ఆరాధ్యంగా భావించే అరోకియా అతడిలానే తన దేహాన్ని మార్చుకోవడానికి నిత్యం కష్టపడ్డాడు. ఈ క్రమంలో మిస్టర్ యూనివర్స్ పొటీల్లో అనేక పర్యాయాలు మలేషియాకు ప్రాతినిధ్యం వహించాడు. 1968‌లో తన సొంత రాష్ట్రం పెరాక్‌లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి, తన తొలి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత 1981 ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆగ్నేయాసియా క్రీడల్లో స్వర్ణం సాధించి సత్తా చాటాడు. ఆ తర్వాత మలేషియాలోని ‘తెలుక్ ఇంటాన్’‌ టౌన్‌లో ‘జిమ్’ ప్రారంభించి ఔత్సాహిక బాడీబిల్డర్లకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. అరోకియాసామి మలేషియాకి చెందిన భారత సంతతికి చెందిన వ్యక్తి కాగా, తన జిమ్‌లో శిక్షణ పొందుతున్న వారి దగ్గరి నుంచి రోజుకు కేవలం ఒక డాలర్ మాత్రమే ఫీజుగా తీసుకుంటున్నాడు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన అతడి జిమ్‌లో అత్యాధునిక సామగ్రి కనిపించదు. స్క్రాప్ మెటల్‌తో తయారు చేసిన మెషిన్స్ కనిపిస్తుంటాయి. కాగా బాడీ బిల్డింగ్‌లో తన అనుభవాన్ని రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుండటం విశేషం.

అరోకియాకు హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ క్రీడల్లోనూ ప్రవేశముంది. కానీ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. తను విజయవంతమైన అథ్లెట్ అయినప్పటికీ, ఇప్పటికీ పాఠశాలలో తోటమాలిగా, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. క్రమం తప్పకుండా పని చేయడంతో పాటు సమతుల ఆహారం, వ్యాయామంతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగానని చెప్పే అరోకియా.. తను సొంతంగా పండించుకున్న కూరగాయాలనే ఆహారంగా స్వీకరిస్తాడు. చక్కెర, జంక్ ఫుడ్, డ్రగ్స్, స్టెరాయిడ్లకు దూరంగా ఉంటాడు.

Tags:    

Similar News