Jaishankar : కెనడా పౌరులు బెదిరించినా.. వాక్ స్వాతంత్య్రమేనట : ఎస్.జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో : భారత్ విషయంలో కెనడా ప్రభుత్వం తీసుకున్న వైఖరిని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తప్పుపట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో : భారత్ విషయంలో కెనడా ప్రభుత్వం తీసుకున్న వైఖరిని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తప్పుపట్టారు. తనకొక న్యాయం, ఇతరులకొక న్యాయం అన్నట్టుగా కెనడా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కెనడా రెండు నాల్కల ధోరణిని ఎండగట్టేందుకు ‘ద్వంద్వ ప్రమాణాలు’ అనే పదం కూడా సరిపోదన్నారు. ‘‘భారత నేతలు, దౌత్యవేత్తలను కెనడా పౌరులు బహిరంగంగా బెదిరిస్తున్నారని మేం చెబితే.. దాన్ని వాక్ స్వాతంత్య్రంగా కెనడా అభివర్ణిస్తోంది. చివరకు కెనడాలోని భారత హైకమిషనర్‌ను అక్కడి పౌరులు బెదిరించినా భావ ప్రకటన స్వేచ్ఛగానే పరిగణించాలట’’ అని జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘భారత్‌లోని కెనడా దౌత్యవేత్త సౌత్‌బ్లాక్ నుంచి కోపంతో బయటకు వచ్చారని ఓ భారత జర్నలిస్టు పేర్కొనడాన్ని కూడా కెనడా సీరియస్‌గా తీసుకుంది. విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కెనడా ప్రభుత్వం ఆరోపించింది’’ అని భారత విదేశాంగ మంత్రి గుర్తు చేశారు. ‘‘భారత దౌత్యవేత్తల సంక్షేమం, భద్రత గురించి కెనడాకు పట్టడం లేదు. అదే భారత్‌లో.. కెనడా దౌత్యవేత్తలకు చాలా స్వేచ్ఛ ఉంది. భారత సైన్యం, పోలీసుల సమాచారాన్ని వాళ్లు స్వేచ్ఛగా సేకరించుకోవచ్చు’’ అని ఎస్.జైశంకర్ తెలిపారు. ఓ జాతీయ వార్తా ఛానల్ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు విచారణలో భారత హైకమిషనర్ పాల్గొనాలని కెనడా కోరినందు వల్లే తాము అక్కడి నుంచి హైకమిషనర్‌తోపాటు దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్లు జైశంకర్ చెప్పారు. ‘‘గత పాతికేళ్లలో ప్రపంచ సమీకరణాలు వేగంగా మారాయి. బహుళ ధ్రువ ప్రపంచం అవతరించింది. పశ్చిమేతర దేశాలు కూడా ముందు వరుసలోకి వచ్చాయి. ఫలితంగా పశ్చిమ దేశాలు, పశ్చిమేతర దేశాల మధ్య లెక్కలు మారిపోయాయి’’ అని జైశంకర్ అభిప్రాయపడ్డారు.