‘కమల్’ విలాపం.. కమల వికాసం?

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో గంటగంటకూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో మకాం వేశారు. వారితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ ఉన్నారు. సింధియా రాజీనామాతో 20 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ లేఖలను ఆ రాష్ట్ర గవవర్నర్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత […]

Update: 2020-03-10 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో గంటగంటకూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో మకాం వేశారు. వారితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ ఉన్నారు. సింధియా రాజీనామాతో 20 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ లేఖలను ఆ రాష్ట్ర గవవర్నర్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ సాయంత్రం 6 గంటలకు భోపాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. త్వరలో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలుతుందని మీడియాతో శివరాజ్ సింగ్ పేర్కొనడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్, న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వివేక్ టంకా, మాజీ శాసనసభా పక్ష నేత అజయ్ సింగ్, ఆ రాష్ట్ర సీఎం కమల్‌నాథ్, మరో 10 మంది క్యాబినెట్ మంత్రులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై తర్జనభర్జన పడుతున్నారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ సంఖ్యాబలం 230. కాగా, జౌరా కాంగ్రెస్ శాసనసభ్యుడు బన్వరిలాల్ శర్మ, అగర్-మాల్వ బీజేపీ ఎమ్మెల్యే మనోహర్ ఉత్వల్ మృతి చెందడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సంఖ్యా బలం 228కి పడిపోయింది. మెజార్టీకి 115 సభ్యుల బలం అవసరం ఉండగా, కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు కమల్‌నాథ్ సర్కారుకు మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఇద్దర్ని పంపించడానికి కాంగ్రెస్‌కు పూర్తి బలం ఉంది. మరోవైపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవడమూ సాధ్యమే.

కానీ, గత వారం రోజులుగా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలో ఉన్నారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో బస చేసినట్లు సమాచారం. క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేల్లో 17 మంది జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులు. కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలూ తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ లేఖలను గవర్నర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంఖ్యా బలం 95కు పడిపోనున్నది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ, ఇండిపెండెంట్లను కలుపుకుంటే ఆ పార్టీ బలం 102కు చేరుకుంటుంది. కానీ, బీజేపీ సంఖ్యా బలం 107. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

బీజేపీ ఎత్తులను గమనిస్తున్న సీఎం కమల్‌నాథ్‌పై ఎత్తులను వేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇద్దర్ని తన వైపునకు తిప్పుకున్నారు. కమల్‌నాథ్ ఆదేశాల మేరకు వారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీ సంఖ్యాబలం 226కు పడిపోతుంది. అలాగే, అజ్ఞాతంలో ఉన్న 20 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే 207 సీట్లకు తగ్గిపోతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 104 మంది ఎమ్మెల్యేల బలం అవసరం పడుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేసినా ఆ పార్టీ సంఖ్యాబలం 105కు చేరుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 102గా ఉంటుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఏరకంగా చూసినా కమల్‌నాథ్ సర్కారు కూలిపోయినట్లే.

Tags:    

Similar News