బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరితో మంగళవారం టెలిఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో మంత్రులంతా బిజీగా ఉన్నందున ఆ పనులకు అంతరాయం కలిగించరాదన్న అభిప్రాయంతో ఈ నెల 20వ తేదీన జరప తలపెట్టిన కేబినెట్ భేటీని రద్దు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరితో మంగళవారం టెలిఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో మంత్రులంతా బిజీగా ఉన్నందున ఆ పనులకు అంతరాయం కలిగించరాదన్న అభిప్రాయంతో ఈ నెల 20వ తేదీన జరప తలపెట్టిన కేబినెట్ భేటీని రద్దు చేశారు. ఆ కారణంగానే మంత్రులతో విడివిడిగా టెలిఫోన్‌లో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ తెల్లవారుజాము వరకు కొనసాగించనున్నట్లు జీవోలో పేర్కొంది. తొలుత పది రోజుల పాటు లాక్‌డౌన్ సరిపోతుందని సీఎం కేసీఆర్, మంత్రివర్గం భావించినా చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ఈ నెల చివరి వరకూ కొనసాగుతున్నందున తెలంగాణలో సైతం అదే తీరులో అమలు చేయాలని భావించింది. ఆ ప్రకారం ఈ నెల 22తో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో ఎనిమిది రోజుల పాటు పొడిగించి ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము వరకు కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. తొలి విడత లాక్‌డౌన్ నిర్ణయాన్ని మంత్రివర్గం నిర్ణయం మేరకు తీసుకున్నా ఇప్పుడు మాత్రం మంత్రులంతా కరోనా కట్టడి చర్యలు, వైద్య చికిత్స పర్యవేక్షణ పనుల్లో బిజీగా ఉన్నందున కేబినెట్ మీటింగ్ కూడా పెట్టకుండా ముఖ్యమంత్రి స్వయంగా వారి నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు 20 గంటల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసరాలను కొనుక్కునేందుకు సడలింపు ఉంటుంది. కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గణాంకాలతో సహా వివరించినప్పటికీ పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు వీలుగా ఈ నెల చివరి వరకు లాక్‌డౌన్ కొనసాగడం ఉత్తమం అని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌లోని నిబంధనలన్నీ యధావిధిగా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.